రేపల్లె అత్యాచార ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

*బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌

Update: 2022-05-02 02:33 GMT

రేపల్లె అత్యాచార ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

Andhra Pradesh: రేపల్లె రైల్వేస్టేషన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు, ప్రజా, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. నేరాలకు పాల్పడే వారికి పోలీసులంటే భయం లేకుండా పోయిందని మండిపడ్డాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ, జనసేన, ఎమ్మార్పీఎస్‌తో పాటు పలు ప్రజా సంఘాలు రేపల్లె సామాజిక ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి.

బాధితురాలిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా విపక్షాలు దురుద్దేశంతో విమర్శిస్తున్నాయన్నారు. ప్రభుత్వం బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం అందిస్తుందని, కుటుంబానికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కుమారుడు రాజీవ్‌ రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు.

రేపల్లె రైల్వేస్టేషన్‌లో సామూహిక అత్యాచార బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు ఒంగోలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరామర్శించేందుకు బాధితురాలి బంధువులు, గ్రామస్థులు, ప్రతిపక్ష నేతలు రిమ్స్‌ వద్దకు తరలివచ్చారు. పోలీసులు గేట్లు మూసి వారిని అడ్డుకోవడంతో రెండు గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే స్వామి, ఎరిక్షన్‌బాబును పోలీసులు అరెస్టు చేసి తరలించేందుకు ప్రయత్నించగా పెనుగులాట చోటుచేసుకుంది.

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆసుపత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనపై ఒక తల్లిగా, మహిళగా ఎంతగానో బాధపడుతున్నానన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. ఇక ఇవాళ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బాధితురాలని పరామర్శించనున్నారు. 

Full View


Tags:    

Similar News