తెదేపాకు పితలాటకం.. ముందు నుయ్యి వెనుక గొయ్యా?

Update: 2019-11-28 01:44 GMT

సాధారణ ఎన్నికలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీకి దగ్గరయ్యారు. అయితే వంశీ వైసీపీలో చేరకపోయినా ఆయనను వైసీపీ నేతగానే గుర్తిస్తున్నారు. వంశీని పార్టీ నుంచైతే సస్పెండ్ చేసింది కానీ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు మాత్రం ఫిర్యాదు చేయలేదు టీడీపీ. దాంతో వంశీ ప్రస్తుతం స్వంతత్ర సబ్యుడిగానే కొనసాగనున్నారు. ఇది టీడీపీని వీడాలనుకుంటున్న మరికొందరు ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. వంశీ తరహాలోనే టీడీపీపై విమర్శలు చేసి ఏదో ఒక పార్టీతో అంటకాగాలనే 'గోపి'లకు వంశీ.. ఒక వరంలా దొరికాడు. గీత దాటినా అనర్హత వేటు వేయాలని టీడీపీ కోరలేదు కాబట్టి తమ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారని పార్టీ మారాలనుకునే నేతలు అనుకుంటున్నారట.

ఇలా జరిగితే టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గీతదాటిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేయకుంటే టీడీపీ బలహీనతను ఆసరా చేసుకొని ఎమ్మెల్యేలు చేజారే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు. ఒకవేళ అనర్హత వేటు వేయమని స్పీకర్ ను కోరినా ఉపఎన్నికలకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. సాధారణ ఎన్నికలు ముగిసి ఆరునెలలు గడవకముందే ఉపఎన్నికలకు వెళ్లడమంటే సాహసమనే చెప్పాలంటున్నారు. ఉపఎన్నికల్లో చాలా సందర్భాల్లో అధికార పార్టీలే గెలుస్తూ వస్తున్నాయని ఈ విషయంలో టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News