TDP MLA Ganta Srinivasarao: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా?

Update: 2020-07-23 09:35 GMT

TDP MLA Ganta Srinivasarao: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 15 నాటికి ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని.. వైసీపీలో గంటా చేరికకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఒకరి ద్వారా గంటా రాయబారం నడిపారని.. గంటాను వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ బలంగా ఉంది. ఆగస్టు 15 న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్న వేళ.. ఈ కార్యక్రమం వేదికగానే గంటా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అటు గంటా కానీ ఇటు వైసీపీ నేతలు కానీ ఖండించలేదు. కాబట్టి గంటా పార్టీ మార్పు వార్తలను కొట్టిపారేయలేమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా గంటా శ్రీనివాసరావు ఇప్పటికే మూడుసార్లు పార్టీ మారారు.

మొదట్లో టీడీపీ నుంచి తన రాజకీయ భవిశ్యత్ ను ప్రారంభించిన ఆయన ఆ తరువాత 2009 లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత కాంగ్రెస్ లో చేరి మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తిరిగి టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 నుంచి 19 వరకూ విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019 లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వంతో అంటీముట్టనట్టుగా గంటా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు ఆయన వైసీపీలో చేరుతారనే రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై తాజాగా వస్తున్న వార్త ఏమౌతుందో చూడాలి.

Tags:    

Similar News