బీజేపీలో చేరనున్న టీడీపీ కీలకనేత!

Update: 2019-08-20 03:17 GMT

ఇప్పటికే కీలకనేతలు పార్టీని వీడడంతో సతమతమవుతున్న టీడీపీకి మరో షాక్ తగలనుందా.. రాయలసీమలో మాజీ మంత్రులు పక్కచూపులు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాయలసీమకు చెందిన ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా చేరేందుకు క్యూలో వేచివున్నారు. అధిష్టానం పిలుపుకోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆయనతో పాటుగా మరో మాజీ మంత్రి కూడా టీడీపీని వీడేందుకు సిద్దమయ్యారట. ఆయనే ఏరాసు ప్రతాపరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరారు. అయితే కాంగ్రెస్ లో కలిసివచ్చినంతగా ఆయనకు టీడీపీలో మాత్రం కలిసిరాలేదు. టీడీపీ టిక్కెట్ తో 2014 ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీచేశారు.. వైసీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి చేతిలో ఓటమిచవిచూశారు.

అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పడినా ఆయనకు మాత్రం ఎటువంటి నామినేటెడ్ పదవి రాలేదు. పైగా పార్టీలో పెద్దగా ప్రాధ్యానత కూడా దక్కలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికలు వచ్చాయి. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు. అయితే టీడీపీ మాత్రం ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో వైసీపీలో చేరాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ గ్రీన్ సిగ్నల్ రాలేదు. గతంలో ఆయన పోటీ చేసిన శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లో టీడీపీ తరుపున ఆల్రెడీ ఇంచార్జ్ లను ప్రకటించారు చంద్రబాబు. ఇటు టీడీపీలో స్థానం లేక అటు వైసీపీలో అవకాశం రాక సతమతమవుతున్నారట ఏరాసు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితే బెటర్ అనుకుంటున్నారట. త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయంలో స్నేహితుడైన టీజీ వెంకటేష్ సలహాలు తీసుకుంటున్నారట ఏరాసు. అన్ని కుదిరితే వినాయకచవితి తరువాత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News