ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు

Update: 2019-11-22 11:54 GMT

రాజీనామా చేసిన మాజీ నేతను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆయనకోసం స్వయంగా పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి
యనమల రామకృష్ణుడే రంగంలోకి దిగారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? ఆయనే వరుపుల రాజా. 2014 నుంచి 19 వరకు తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రత్తిపాడు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది టీడీపీ. గడిచిన ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. దాంతో ఆగస్టులో టీడీపీకి రాజీనామా చేశారు. పోతు పోతూ.. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని, ఆ పార్టీకి ఏపీలో ఇక మనుగడ లేదని.. ప్రజలకు ఏమి కావాలో గుర్తించకపోవడం వల్లే 23 సీట్లకు టీడీపీ పరిమితం అయిందని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తరువాత వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే ఆయనపై డీసీసీబీ నిధులను పక్కదారి పట్టించి కోటాను కోట్లు నొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో రాజాను వైసీపీలోకి తీసుకునేందుకు జిల్లా పార్టీ అంతగా ఆసక్తి కనబరచలేదు. ఈ నేపథ్యంలో ప్రత్తిపాడులో టీడీపీ నాయకత్వ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వరుపుల రాజా ఎలాగో వైసీపీలో చేరలేదు కాబట్టి తిరిగి ఆయనను ఎలాగైనా పార్టీలోకి తీసుకువచ్చి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారట. అందులో భాగంగానే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడును రంగంలోకి దింపారని తెలుస్తోంది. వరుపుల రాజా ఇంటికి యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ బృందం వెళ్లింది. మళ్ళీ టీడీపీలోకి రావాలని ఆయనను కోరారు. అయితే తాను ఆలోచించుకొని చెబుతానని చెప్పినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News