నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన
Chandrababu: మూడ్రోజుల పాటు పర్యటించనున్న చంద్రబాబు
నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన
Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరైన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తనకు మద్దతు తెలిపిన వారికి నేరుగా ధన్యవాదాలు తెలపడంతో పాటు.. కుప్పం ప్రజలను కలిసేందుకు తన నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీకానున్నారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఓ కన్వెన్షన్ హాల్‌లో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ చేసి, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం, మైనార్టీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నాలుగున్నర గంటలకు మల్లానూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
అయితే చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన తర్వాత కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులపై కుప్పం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌తో పాటు స్థానిక ముఖ్య నేతలతో చంద్రబాబు ఇటీవలే సమావేశం అయ్యి.. స్థానిక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గం నేతలతో రివ్యూ తర్వాత చంద్రబాబు కుప్పం రానున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మరోవైపు చంద్రబాబు కుప్పం టూర్‌పై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు కుప్పం భయం పట్టుకుందని.. అందుకోసమే తరచూ కుప్పంలో పర్యటిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.