Andhra Pradesh: నిరసనలు, అరెస్టుల మధ్య రాష్ట్ర బంద్‌

* ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది.

Update: 2021-10-20 04:15 GMT

నిరసనలు, అరెస్టుల మధ్య రాష్ట్ర బంద్‌ 

Andhra Pradesh: ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుకిపోతున్నాయి. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు.

బంద్‌ పిలుపు నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలాస ఆర్టీసీ డిపో వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టగా వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాజాంలో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయన్ను గృహనిర్బంధం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సాలూరు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను టీడీపీ శ్రేణులు నిలిపేశాయి. విశాఖ జిల్లాలోనూ పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. TNSF రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌తో పాటు 10 మంది టీడీపీ నేతలను అరెస్ట్‌ చేశారు.

అటు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ నిరసనలు కొనసాగాయి. పాడేరులో ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును గృహనిర్బంధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఏలూరులో టీడీపీ నేత బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశఆరు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ నేతల నిరసనల నేపథ్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పోలీసులు మోహరించారు. వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద బస్సులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పలువురు కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

రాయలసీమ జిల్లాల్లోనూ ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్‌ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. తిరుమల వచ్చే యాత్రికులకు అసౌకర్యం కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప జిల్లా రాజంపేటలో బస్సులను అడ్డుకున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైదుకూరులో TTD మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను అరెస్ట్‌ చేశారు. టీడీపీ ఆందోళనల నేపథ్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సహా ఆ పార్టీ నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్‌, లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News