వైసీపీ, టీడీపీ ఘర్షణలతో అట్టుడికిన రాష్ట్రం.. ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ

* టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చిన వైసీపీ * ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న టీడీపీ నేతలు

Update: 2021-10-20 01:28 GMT

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులు

Andhra Pradesh: ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీ, వైసీపీ మధ్య రాజుకున్న అగ్గితో అట్టుడుకుతున్నాయి. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. పలుచోట్ల టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి చేశారు. జిల్లాల్లో కూడా టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లను ముట్టడించారు వైసీపీ నేతలు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ శ్రేణులు తమ కార్యాలయాలపై దాడి చేయడంతో టీడీపీ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది.

మంగళవారం పట్టాభి సీఎం జగన్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పట్టాభి ఇంటిపై దాడి చేశారు. ఆయన ఇంట్లో సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రోజుమాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై పట్టాభి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం అనంతరం సీఎంపై వ్యాఖ్యలకు నిరసనగా.. వైఎస్ఆర్ సీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అయింది. ఇదే సమయంలో మంగళగిరి టీడీపీ కార్యాలయం దగ్గర పరిస్థితులు మరింత ఉద్రిక్తకరంగా మారింది. కార్యాలయం ముట్టడికి వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఎంపీ నందిగం సురేష్‌ల నేతృత్వంలో ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.

ఇక మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడితో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార పార్టీ రౌడీయుజం చేస్తోందంటూ టీడీపీ నేతలు.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ కార్యాలయాలపై దాడిని ఖండిస్తూ టీడీపీ బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వగా.. అటు వైసీపీ కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు తెలియజేయాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల పిలుపునిచ్చారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక రాష్ట్రమంతా టీడీపీ, వైసీపీ శ్రేణులు ఆందోళనలు, బంద్‌లకు సిద్ధం కాగా.. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యాలపై ఆవేశాలకు గురికావొద్దని, అందరు కూడా సంయమనం పాటించాలని ఏపీ డీజీపీ కార్యాలయం హెచ్చరించింది. రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.

Tags:    

Similar News