Avinash Reddy: అవినాష్ సీబీఐ విచారణపై సస్పెన్స్
Avinash Reddy: సీబీఐ నెక్ట్స్ స్టెప్‌పై సర్వత్రా ఉత్కంఠ
Avinash Reddy: అవినాష్ సీబీఐ విచారణపై సస్పెన్స్
Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాలేదు. అవినాష్ తల్లికి అనారోగ్యంగా ఉందని చెబుతూ చివరి నిమిషంలో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి దూరమయ్యారు. అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంపై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హైద్రాబాద్ లోని తన నివాసం నుంచి సీబీఐ విచారణకు హాజరుకాకుండా అవినాష్ పులివెందులకు బయలుదేరారు. తల్లికి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ పంపారు. అవినాష్ రెడ్డి నుంచి సమాచారం రాగానే సీబీఐ అధికారుల బృందం తమ కార్యాలయం నుంచి కారులో బయలుదేరారు. అయితే ఎంపీ అవినాష్ తల్లికి గుండెపోటు వచ్చిందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. అవినాష్ తల్లి ఆరోగ్యం విషయాన్ని సీబీఐకి లేఖ ద్వారా తెలిపామని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది మల్లారెడ్డి వివరించారు. విచారణ కోసం మరో తేదీని ఇవ్వాలని కూడా కోరినట్టుగా లాయర్ చెప్పారు.
ఈ నెల 16నే అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు. నాలుగు రోజుల సమయం కావాలని ఆయన కోరారు. దీంతో 19న విచారణకు రావాలని సీబీఐ మరో నోటీసు పంపింది. ఇప్పుడు కూడా సీబీఐ విచారణకు అవినాష్ రాలేదు.
అస్వస్థతకు గురైన అవినాష్ తల్లి లక్ష్మిని మెరుగైన చికిత్స కోసం పులివెందుల నుండి హైద్రాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తరువాత కర్నూల్ ఆసుపత్రి వైద్యులు లక్ష్మికి చికిత్స అందించారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది. వరుసగా రెండు దఫాలు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంపై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఏం ఉండబోతుందనేది చూడాలి మరి.