AP Board Exams 2021: ఏపీలో విద్యార్థుల భవిష్యత్ పై నీలి నీడలు

AP Board Exams 2021: గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2021-04-17 08:02 GMT

Andhra Pradesh: (File Image)

AP Board Exams 2021: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలోనూ విద్యార్థుల భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం కేసులు అదుపులో ఉన్నాయని భావిస్తుండగా ఒక్కసారిగా రాష్ట్రంలో వైరస్ విజృంభించింది. గత 20 రోజుల వ్యవధిలో కేసులు రెట్టింపు అయ్యాయి. మహమ్మారి ఉద్ధృతి ఇలాగే కొనసాగితే ఈ విద్యా సంవత్సరం పరిస్థితి ఏంటి అన్నదానిపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది.

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సీబీఎస్ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతకుముందే మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాలు ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నాయి. రెండు రోజుల క్రితం తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ప్రమోట్ చేశారు. కొన్ని పరీక్షలను వాయిదావేశారు. ఏపీలో ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనా ? పిల్లల భవిష్యత్ పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో విద్యా సంస్థలు బంద్ చేసి పరీక్షలు రద్దు చేశారు. ఏపీలో యధావిధిగా ప్రభుత్వం, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు కొనసాగుతున్నాయి. అనేక జిల్లాల్లో విద్యా సంస్థలు హాట్ స్పాట్స్ గా మారుతుండడంతో తల్లిదండ్రులు భయందోళన చెందుతున్నారు. పిల్లలను స్కూల్ కు పంపేందుకు ఆలోచిస్తున్నారు.

కరోనాతో నేపద్యంలో విద్యా సంవత్సరం రద్దు చేయడం కంటే ప్రత్యామ్నాయ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని విద్యా వేత్తలు సూచిస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా విద్యా సంవత్సరం వృధా అవడంతో విద్యార్థులు పోటీ పరీక్షలకు దూరమయ్యారని, ఉన్నత చదువులకు వెళ్లాల్సిన వారంతా మధ్యలో ఆగిపోయారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతానికి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News