Srikakulam: మొక్కులు తీర్చుకోవడానికి కాదు.. ఫోజులు ఇవ్వడానికి రండి!

Srikakulam: సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురంలోని పురాతన సీతారాముల ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఫోటో షూట్లు వివాదాస్పదంగా మారాయి.

Update: 2026-03-21 05:14 GMT

Srikakulam:మొక్కులు తీర్చుకోవడానికి కాదు.. ఫోజులు ఇవ్వడానికి రండి!

సంతకవిటి (గుల్ల సీతారాంపురం): చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మికతకు నిలవైన గుల్ల సీతారాంపురం శ్రీ సీతారాముల దేవాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అలనాటి బొబ్బిలి రాజులు ఏకశిలపై అత్యంత పవిత్రంగా నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణం, ప్రస్తుతం ఫోటో షూటింగులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

భక్తి భావన పక్కనపెట్టి.. వ్యాపార ధోరణి:

పురాతన శిల్ప సంపదతో విరాజిల్లే ఈ ఆలయాన్ని కొందరు స్వార్థపరులు రోజువారీ అద్దెకు ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చే జంటలు, బంగారం షాపుల ప్రకటనల కోసం ఇక్కడ డ్రోన్ కెమెరాలతో హడావుడి చేస్తున్నారు.

జ్ఞాన మందిరంలో బట్టలు మార్పులు - మండిపడుతున్న మహిళలు:

మరింత విచారకరమైన విషయం ఏమిటంటే, షూటింగులకు వచ్చే వధూవరులు బట్టలు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఆలయంలోని 'జ్ఞాన మందిరాన్ని' వాడుతుండటం. పవిత్రమైన ఆలయ గర్భాలయం సమీపంలోనే అసభ్యకర రీతిలో ఫోటోలకు ఫోజులివ్వడంపై గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఇది దైవ సన్నిధానమా లేక సినిమా షూటింగ్ స్పాటా?" అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.

దేవాదాయ శాఖ సీరియస్:

ఈ ఘటనపై సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా షూటింగులకు అనుమతి ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పవిత్రమైన దేవాలయాల్లో ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News