కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో కొత్త కొత్త నిబంధనలు తెరపైకి వస్తున్నాయి. ఇంతవరకు ఏదైనా పోటీ ఎగ్జామ్ కు హాజరయ్యే విద్యార్థులు ధరఖాస్తులో నమోదు చేసిన సెంటర్ లోనే అవకాశం కల్పించేవారు. అయితే మారిన పరిస్థితులు కరోనా వ్యాప్తి తదితర వ్యవహారాల వల్ల విద్యార్థులు దూరం ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో కొంత వెసులుబాటు కల్పించారు. అవసరమైన వారు కొత్తగా ఎగ్జామ్ సెంటర్ ను సూచించవచ్చని పేర్కొన్నారు.
ఏపీ విద్యార్ధులకు ఎంసెట్ అధికారులు గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపధ్యంలో ఎగ్జామ్ సెంటర్‌ను మార్చుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఏపీ ఎంసెట్ పరీక్షకు 2,64,857 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ రవీంద్ర వెల్లడించారు. వీరిలో ఇంజనీరింగ్‌కు 1,79,774మంది, అగ్రికల్చర్ మెడిసిన్‌కు 84,479మంది, ఈ రెండింటికీ కలిపి 604 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇక జూలై 27 నుంచి 31 వరకూ జరిగే ఎంసెట్ పరీక్షను విద్యార్ధులు రాసేందుకు వీలుగా ఎగ్జామ్ సెంటర్ మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించనున్నట్లు కన్వీనర్ రవీంద్ర చెప్పుకొచ్చారు. దీని కోసం ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక ఆప్షన్‌ను ఇస్తున్నామన్నారు.
ఏపీ ఎంసెట్.. ముఖ్యమైన తేదీలు ఇవే…
- రూ. 500 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 1000 ఫైన్‌తో జూలై 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 5000 జరిమానాతో జూలై 17 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 10,000 ఆలస్య రుసుంతో జూలై 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
- ఎంసెట్ ఎగ్జామ్ తేదీలు: జూలై 27 నుంచి 31