ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ (బుధవారం) ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రతిష్టాత్మకమైన 'జగనన్న అమ్మ ఒడి' పథకం మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా 66 వేల మంది గర్భవతులు, బాలింతలకు, 3.18 లక్షల మంది పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించనున్నారు.
హజ్ యాత్రికులకు, జెరూసలేం యాత్రికులకు వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్న వారికి రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంపు, వార్షికాదాయం మూడు లక్షలపైన ఉన్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేబినెట్ తీర్మానించనున్నట్టు తెలుస్తోంది. రోబో ఇసుకను ప్రోత్సహించేందుకు క్రషర్స్‌కు పావలా వడ్డీకే రుణాలను అందించనున్న నిర్ణయానికి ఆమోదం తెలపనుంది.