మంగళగిరిలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళన
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విడుదల చేయని ప్రోత్సాహకాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం ముందు గత ఐదు రోజులుగా శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు.
మంగళగిరి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విడుదల చేయని ప్రోత్సాహకాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం ముందు గత ఐదు రోజులుగా శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించేందుకు తీసుకున్న రుణాలు, పెట్టుబడులు నిలిచిపోయాయని, ప్రభుత్వం నుంచి రావలసిన సబ్సిడీ, వడ్డీ సబ్సిడీ, విద్యుత్ రాయితీ వంటి ప్రయోజనాలు ఇప్పటికీ అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు కొందరు యాజమాన్యాలకు కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే సబ్సిడీలు అందగా, వేలాది యూనిట్లకు ఒక్క రూపాయి కూడా చేరలేదన్నారు. రుణాల వాయిదాలు పేరుకుపోవడం వల్ల బ్యాంకులు వసూళ్ల నోటీసులు జారీ చేస్తున్నాయని, కొందరిపై అప్పుల పునరుద్ధరణ న్యాయమండలి కేసులు కూడా నమోదు అయ్యాయని వివరించారు. ఎంఎస్‌ఎంఈ పథకం కింద లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు కొనుగోలు చేసిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు సబ్సిడీలు రాకపోవడంతో బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, వాహనాలు సీజ్ అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అప్పులు పేరుకుపోయి కుటుంబాలు అల్లాడిపోతున్నాయని జంగాల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఎనిమిది వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సిపిఐ వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రోత్సాహకాలను వంద శాతం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రోత్సాహకాలు విడుదల అయ్యే వరకు బ్యాంకుల వసూళ్ల చర్యలు, అప్పుల పునరుద్ధరణ మండలి కేసులను నిలిపివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, ఆకురాతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.