Sankranthi Special: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సందడి

Update: 2021-01-13 03:29 GMT

భోగి వేడుకలు (ఫైల్ ఫోటో)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రతి లోగిలి సరదాల వేదికగా మారింది. ప్రతి ఇల్లు వినోదాల విందుగా మారింది. భగభగ మండే భోగి మంటలు ప్రతి ఇంటా వెలుగులు చిమ్ముతున్నాయి. రంగు రంగుల ముగ్గులు సిరులకు ఆహ్వానం పలుకుతున్నాయి. హరిదాసుల సంకీర్తనలు బసవన్నల నృత్యాలు పల్లెలకు నయా జోష్‌ తెచ్చిపెట్టాయి. గుమ్మానికి వేలాడే తోరణాలు అల్లుళ్లకు స్వాగతం పలుకుతున్నాయి. మొత్తానికి భోగభాగ్యాలను ప్రసాదించే భోగితో సంక్రాంతి సంబురాలు షురు అయ్యాయి.

భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఆధ్యాత్మిక పరంగా అగ్నిదేవుడికి ఆరాధానగా భావించే భోగి మంటలు వేయడం వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. భోగి మంటల్లో దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఇలా భోగి మంటల నుంచి అతిశక్తివంతమైన గాలి వస్తుంది. అది మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది.

భోగి అనగానే సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున భోగిమంటలు వేయడం.. సాయంత్రం భోగిపండ్లు పోయించుకోవడంతో పిల్లలు తెగ సందడి చేస్తారు. భోగి రోజున భోగి పళ్లు పోస్తూ పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తారు. రేగిపళ్లను సంస్కృతంలో బదరీఫలం అంటారు. భోగిపళ్లల్లో చేమంతి బంతి పూరేకలు అక్షింతలు చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు.ముంగిలిలో మెరిసే రంగుల ముగ్గులు. నింగిలో ఎగిరే పతంగుల హంగులతో తెలుగు రాష్ట్రాలు సంబురాలు జరుపుకుంటున్నాయి. 

Full View


Tags:    

Similar News