గోదావరి డెల్టాకు పూర్వ వైభవం : మంత్రి నిమ్మల

గోదావరి డెల్టాకు పూర్వ వైభవం తెస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

Update: 2025-12-09 14:32 GMT

అమరావతి: గోదావరి డెల్టాకు పూర్వవైభవం తెస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యలపై మంత్రి ఈరోజు సచివాలయంలో సమీక్షించారు. గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం రూ.13.4 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ డిసెంబర్ కు గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య , లాకులు, గేట్లు మరమ్మతులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయాలని ఏజెన్సీ కి ఆదేశాలు జారీ చేశారు. 150 ఏళ్ళలో ఎప్పుడూ జరగనంత నష్టం గోదావరి డెల్టాకు జగన్ హాయాంలో జరిగిందని తెలిపారు. జగన్ గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు అర్దాంతరంగా నిలిపేసి, డెల్టా ఆధునీకరణకు సైంధవుడిలా అడ్డుపడ్డాడన్నారు. నిధులున్నా కాలువలు, డ్రైన్లలో తట్టమట్టి తీయకపోగా, లాకులు, షట్టర్లకు కనీసం గ్రీజు పెట్టడానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. ధవళేశ్వరం బ్యారేజ్ కు కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి సిఎం చంద్రబాబు రూ.150 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు,ఈఎన్సీ నరసింహామూర్తి, గోదావరి డెల్టా సిస్టమ్ సిఈ, ఎస్‌ఈ,ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News