Visakhapatnam: విశాఖలో ఇద్దరు చిన్నారులకు పునర్‌జన్మ

* డాక్టర్లు సైతం ఊహించని ట్విస్ట్ * రెండేళ్ల క్రితం కచ్చులూరు బోటు ఘటనలో.. * తమ ఇద్దరు కుమార్తెలను పోగొట్టుకున్న దంపతులు

Update: 2021-09-21 06:04 GMT

 విశాఖలో ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ (ఫోటో-ది హన్స్ ఇండియా)

Visakhapatnam: అయినవారందరినీ కోల్పోయిన ఆ దంపతుల ముఖంలో మళ్లీ చిరునవ్వులు పూశాయి. రెండేళ్ల క్రితం బోటు ప్రమాదంలో ఏ రోజైతే ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో, సరిగ్గా అదే తేదీన ఊహించని రీతిలో మళ్లీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టినప్పటికీ, ఆ ఇద్దరూ దేవుడిచ్చిన బిడ్డలేనని, చనిపోయిన బిడ్డలే మళ్లీ తిరిగి వచ్చారని దంపతులిద్దరూ మురిసిపోతున్నారు.

2019, సెప్టెంబరు 15న రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అదే బోటులో విశాఖలోని ఆరిలోవకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నారు. అద్దాలపై డిజైన్లు వేసే తలారి అప్పలరాజు తన తల్లిదండ్రులతో పాటు తన ఇద్దరు కుమార్తెలు గీతావైష్ణవి, ధాత్రి అనన్యలను కూడా భద్రాచలం రాముడి దర్శనానికి పంపించారు. బోటు ప్రమాదంలో తమ ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులతో పాటు మొత్తం తొమ్మిది మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు అప్పలరాజు దంపతులు. కనీసం తమ బిడ్డుల చివరి చూపు కూడా దక్కలేదని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.

పిల్లలు చనిపోయారన్న బాధను దిగమింగుకునేందుకు మరల పిల్లల కోసం ఆ దంపతులు ప్రయత్నం సాగించారు. భార్య భాగ్యలక్ష్మికి ఇదివరకే ట్యూబెక్టమీ ఆపరేషన్ జరగటం తో  పిల్లలు పుట్టరని కుంగిపోయారు. కృత్రిమ గర్భధారణ ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుడతారని తెలుసుకొని నగరంలోని పద్మశ్రీ ఆస్పత్రిని గతేడాది సంప్రదించారు. వారికి టెస్టులు చేసి డాక్టర్ మరల పిల్లులు పుడతారని చెప్పింది. టెస్ట్యూ బేబి ద్వారా భాగ్యలక్ష్మి మరల గర్భం దాల్చగా అక్టోబర్‌లో పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు. కానీ సరిగ్గా ప్రమాదం జరిగిన సెప్టెంబర్‌ 15న భాగ్యలక్ష్మి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడం విశేషం.

మరోవైపు జరిగిన ఘటనను తెలుసుకొని పురుడు పోసిన హాస్పిటల్ వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. భాగ్యలక్ష్మి కి డెలివరీ డేట్ అక్టోబర్‌ 20న ఇచ్చామని, అయితే ఆమెకు 15వ తారీఖునే పురిటి నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా డెలివరీ చేసామని గైనకాలజిస్ట్ పద్మశ్రీ చెబుతున్నారు. ముందుగా అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు పిల్లల కోసం తనను సంప్రదించే సమయంలో కడుపులో పుట్టిన పిల్లలను, అయినవారిని కోల్పోయి చాలా డిప్రెషన్‌తో ఉన్నారని, ఇప్పుడు వాళ్ళకి ట్విన్స్  పుట్టారని వారి ఆనందానికి అవధులు లేవని డాక్టర్ పద్మశ్రీ అన్నారు. బోటు ప్రమాదం జరిగిన రోజు రాత్రి 8 గంటలకు తమ పిల్లులు చనిపోయారన్న విషయం తల్లి భాగ్యలక్ష్మికి తెలిసిందని మరల రెండేళ్ల తర్వాత అదే రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పిల్లలు పుట్టడంతో వారు తమ పిల్లలు తిరిగివచ్చారని ఆనందం పడుతున్నారని డాక్టర్లు అంటున్నారు.

Tags:    

Similar News