Vijaya Sai Reddy Resigns: వైసీపీకి సీనియర్ నేతలు ఎందుకు గుడ్ బై చెబుతున్నారు?
Vijaya Sai Reddy Resigns: వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది? ఫ్యాన్ పార్టీలో ఉక్కపోతను భరించలేకపోతున్నారా? జగన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు పన్నిన ట్రాప్‌లో భాగంగా ఆ పార్టీని వీడుతున్నారా?
జగన్‌కు అత్యంత సన్నిహితులు.. ఎందుకు వైఎస్ఆర్‌సీపీని వీడుతున్నారు?
Vijayasai Reddy's resignation: మొన్న మోపిదేవి వెంకటరమణ.. నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి... తాజాగా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్‌సీపికి గుడ్ బై చెప్పారు. మరికొందరు కూడా ఇదే బాటలో నడుస్తారనే చర్చ తెరమీదికి వచ్చింది. జగన్‌కు సన్నిహితంగా పేరున్న నాయకులు ఎందుకు పార్టీని వీడుతున్నారు. వైఎస్ఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న విజయసాయి రెడ్డి ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
అసలు వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది? ఫ్యాన్ పార్టీలో ఉక్కపోతను భరించలేకపోతున్నారా? జగన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు పన్నిన ట్రాప్‌లో భాగంగా ఆ పార్టీని వీడుతున్నారా? అధికారంలో ఉన్న పార్టీల వైపు వెళ్లేందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నారా? వైఎస్ఆర్‌సీపీలో కీలక నాయకుల వరుస వలసలపై ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీ.
జగన్‌కు చెప్పే రాజీనామా చేసిన విజయ సాయి రెడ్డి
వైఎస్ జగన్‌కు సన్నిహిత సంబంధాలున్న వైఎస్ విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు సోషల్ మీడియాలో జనవరి 24న పోస్టు పెట్టారు. జనవరి 25న విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. తాను రాజీనామా నిర్ణయాన్ని వైఎస్ జగన్‌కు చెప్పానన్నారు. పార్టీ తనకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. తనకు వైఎస్ కుటుంబంతో విబేధాలు లేవని ఆయన వివరించారు.
ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌తో పాటు విజయసాయిరెడ్డిపై కూడా కేసులున్నాయి. ఈ కేసులో విజయసాయి రెడ్డిని 2012 జనవరి 2న సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్ పై ఆయన విడుదలయ్యారు.
4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో విజయసాయికి అనుబంధం
వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో విజయసాయి రెడ్డికి 4 దశాబ్ధాల అనుబంధం ఉంది. వైఎస్ కుటుంబానికి విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ మెంబర్ గా కూడా విజయసాయిరెడ్డికి పోస్టు దక్కింది. జగన్ ఆర్ధికంగా ఎదగడానికి విజయసాయిరెడ్డిదే కీలక పాత్రగా చెబుతారు.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో విజయసాయిరెడ్డిదే మాస్టర్ మైండ్ అని ఆస్తుల కేసులో దర్యాప్తు సంస్థలు విజయసాయిరెడ్డిపై అభియోగాలు మోపాయి.
2019లో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ వర్గాలు చెబుతాయి. కేంద్రంలో అన్ని పార్టీలతో పాటు బీజేపీ కీలక నాయకులు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సంబంధాలను పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం విజయసాయి రెడ్డి ఉపయోగించారని ఫ్యాన్ పార్టీ వర్గాలు చెబుతాయి.
వైఎస్ఆర్‌సీపీని వీడుతున్న నాయకులు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీని కీలక నాయకులు వీడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారానికి దూరమైంది. పార్టీలోని పరిణామాలు, ఏపీలో రాజకీయ పరిణామాలతో ఫ్యాన్ పార్టీని నాయకులు వీడుతున్నారు. 2024 సెప్టెంబర్ 18న వైఎస్ఆర్‌సీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు.
వైఎస్ఆర్ మరణంతో జగన్ తో బాలినేని రాజకీయ ప్రయాణం సాగించారు. 2019లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మంత్రివర్గంలో బాలినేనికి చోటు దక్కింది. మూడేళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవి పోయింది. కానీ, అదే జిల్లాకు చెందిన ఆదిమూలం సురేష్ ను జగన్ కొనసాగించారు. దీంతో పాటు పార్టీలో జరిగిన పరిణమాలతో బాలినేని అసంతృప్తికి గురయ్యారు.
ప్రకాశం జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. పార్టీలో తన బంధువు వైవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తనను తన వర్గాన్ని పట్టించుకోకపోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. తన వాదనను జగన్ పట్టించుకోలేదని ఆయన రగిలిపోయారు. పొమ్మనలేక పొగబెట్టారని భావించిన ఆయన ఫ్యాన్ పార్టీకి దూరమయ్యారు.
2024 సెప్టెంబర్ 26న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. అదే రోజున ఆయనతో పాటు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను కూడా జనసేన తీర్థంపుచ్చుకున్నారు.
2024 ఆగస్టు 29న వైఎస్ఆర్‌సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఇద్దరు ఆ తర్వాత టీడీపీలో చేరారు. మోపిదేవి వెంకటరమణపై అప్పట్లో వాన్ పిక్ కేసు నమోదైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ తో ఆయన రాజకీయ ప్రయాణం సాగించారు.
మంత్రివర్గం నుంచి తప్పించి ఆయనను రాజ్యసభకు పంపారు. 2024 ఎన్నికల సమయంలో మోపిదేవి వెంకటరమణకు జగన్ టికెట్ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా టికెట్టు ఇచ్చే విషయంలో స్పష్టత లేదు. దీంతో మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైఎస్ఆర్‌సీపీలో చేరిన బీద మస్తాన్ రావు తిరిగి పాత గూటికి చేరారు.
టీడీపీ తిరిగి బీద మస్తాన్ రావును రాజ్యసభకు పంపింది. 2024 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య కూడా రాజీనామా చేశారు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరపున ఆర్. కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభకు మళ్లీ ఎన్నికయ్యారు. తాజాగా విజయసాయి రెడ్డి రాజీనామాతో ఈ సీటు కూడా కూటమి ఖాతాలో పడనుంది.
మాజీ మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ, ఎండి ఇంతియాజ్, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు, పోతుల సునీత తదితరులు వైసీపీని వీడారు.
విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక
గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై విజయసాయి రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జీగా నియమించారు.
ఆ సమయంలో ఆయనపై అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. దీనికితోడు స్వంత పార్టీకి చెందిన నాయకులు కూడా జగన్‌కు ఆయనపై ఫిర్యాదులు చేశారు. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించారు జగన్.
ఇది అప్పట్లో విజయసాయి రెడ్డికి అసంతృప్తిని గురి చేసిందనే ప్రచారం సాగింది. అదే సమయంలో తారకరత్న మరణించారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి ఆయన సమీప బంధువు. తారకరత్న కూడా చంద్రబాబుకు బంధువు. దీంతో తారకరత్న అంత్యక్రియలతో పాటు, ఇతర కార్యక్రమాల సమయంలో చంద్రబాబుతో విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలిగారు.
ఆ సమయంలో ఇది చర్చకు దారితీసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ సమయంలో తిరిగి ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. పార్టీ ఓటమి పాలైన తర్వాత విజయసాయి రెడ్డిపై కొత్తగా కేసులు నమోదయ్యాయి.
కాకినాడ పోర్టుతో పాటు మరికొన్ని కేసులు ఆయనపై నమోదయ్యాయి. కాకినాడ పోర్టులో తన వాటాను అక్రమంగా తీసుకున్నారని కేవీ రావు ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విజయసాయి రెడ్డిపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీనికి తోడు పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ నాయకుడిగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. కానీ, ఇప్పుడు ఆ బాధ్యతను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. లోక్ సభలో ఆ పార్టీ నేత బాధ్యతను మిథున్ రెడ్డికి అప్పగించారు.
మరో వైపు పార్టీలో సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం విజయసాయి రెడ్డిని అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం కూడా ఉంది. దీనికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదు చేసిన కేసుల విషయమై విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో పార్టీ నాయకులు ఎవరూ కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడలేదు. ఈ పరిణామాలన్నీ విజయసాయి రెడ్డి రాజీనామాకు కారణమై ఉండొచ్చని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి చెప్పారు. ఈ కారణంతోనే జగన్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడానికి కారణమై ఉండొచ్చని ఆయన అన్నారు.
ఏపీ రాజకీయాల్లో మార్పులు వస్తాయా?
నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ నేతృత్వంలోని జేడీ యూ పార్టీలపై ఆధారపడింది. నితీష్ కుమార్ కూటములను మార్చడంలో దిట్ట. రెండు రోజుల క్రితం మణిపూర్ లో బీజేపీకి జేడీయూ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
అయితే చంద్రబాబు అవసరం బీజేపీకి, బీజేపీ అవసరం చంద్రబాబుకు ఉన్నాయి. చంద్రబాబు కూడా ఎన్ డీ ఏలో కొనసాగుతున్నారు. ఏపీలో బీజేపీ రాజకీయంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలలో ఏదో ఒక పార్టీ స్థానాన్ని బీజేపీ దక్కించుకోవాలి. టీడీపీ బీజేపీకి మిత్రపక్షం.
టీడీపీ బలహీన పడితే రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీకి లాభం. ఆ పార్టీని మరింత బలహీనం చేస్తే ఆ స్థానం ఆక్రమించవచ్చనేది బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. వైసీపీ మరింత బలహీనపడితే పరోక్షంగా అది బీజేపీకి లాభమని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు పి. విక్రం చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలను దెబ్బతీసేందుకు బీజేపీ అనేక స్ట్రాటజీలను అమలు చేస్తున్న విషయాలను చూస్తున్నామని ఆయన అన్నారు.
మరో వైపు విజయసాయి రెడ్డి రాజీనామా ఆపార్టీ అంతర్గత వ్యవహరమని చంద్రబాబు అన్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా ఆ పార్టీ పరిస్థితిని తెలుపుతోందన్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి
పార్టీని వీడడం మామూలు విషయం కాదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను మాట్లాడాలని ఆమె విజయసాయి రెడ్డిని కోరారు.
2024 ఎన్నికల్లో దెబ్బతిన్న జగన్ ... 2029 ఎన్నిలకు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సీనియర్లు వరుసగా ఆ పార్టీని వీడడం ఇబ్బందికి గురిచేస్తోంది. సీనియర్లు పార్టీని వీడినా ఇబ్బంది లేదని జగన్ చెబుతున్నారు. వలసలకు చెక్ పెట్టి వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్దం చేస్తామంటున్నారు. ఇందుకు జగన్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.