Kadapa: కోర్టు సినిమాను తలపించేలా, కడపలో రియల్ సీన్ సంచలనం
Kadapa Incident: కడప శివారులోని రామారాజుపల్లెకు చెందిన దళిత యువకుడు విజయ్ అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమించాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసి, వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
Kadapa: కోర్టు సినిమాను తలపించేలా, కడపలో రియల్ సీన్ సంచలనం..పోలీసుల సమక్షంలోనే
కడప శివారులోని రామారాజుపల్లెకు చెందిన దళిత యువకుడు విజయ్ అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమించాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసి, వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం, యువకుడిని పిలిపించి బాలిక మైనర్ కావడంతో పెళ్లి చేస్తే కేసు పడుతుందని పోలీసులు హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ప్రేమికులు పరారయ్యారు.
తర్వాత, బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విజయ్‌ను పట్టుకొని పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం అతనిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇది తెలుసుకున్న విజయ్ బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆయన అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విజయ్‌ను అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ ఉద్రిక్త పరిస్థితిలో విజయ్ బంధువుల్లో ముగ్గురు, పోలీసుల సమక్షంలోనే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో కొంత గందరగోళం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆందోళనకారులు స్టేషన్ ఎదుట బైఠాయించి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు వాహనాలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ కూడా స్తంభించింది. చివరకు స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ కేసుపై స్పందించిన స్టేషన్ సీఐ రెడ్డెప్ప మాట్లాడుతూ, “బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. నిబంధనల ప్రకారమే విజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించాం. బంధువుల ఆరోపణలు నిరాధారమైనవే,” అని చెప్పారు.