విశాఖలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో వృక్షా బంధన్ కార్యక్రమం

Visakhapatnam: రైల్వేస్టేషన్ రోడ్డులోని భారీ మర్రి చెట్టుకు రాఖీ కట్టి వేడుక

Update: 2022-08-12 05:06 GMT

విశాఖలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో వృక్షా బంధన్ కార్యక్రమం

Visakhapatnam: రాఖీ పండుగ రోజు ఆడపడచులు అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకుంటారు. కష్టసుఖాల్లో సోదరులు తోడునీడై వుండాలని కోరుకుంటారు. కానీ, విశాఖ‌లో విద్యార్థినులు చెట్టుకు రాఖీ కట్టి వృక్షా బంధన్‌ను జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆడపడుచులు సోదరులకు రాఖీ కట్టి, రక్షణగా వుండాలని కోరుకుంటారు. కాబట్టే రాఖీ పండుగను రక్షా బంధన్‌గా పిలుస్తారు. అదేవిధంగా ప్రకృతిలో మమేకమైన మనిషికి వృక్షాలు అండగా వుంటాయి. స్వచ్ఛమైన గాలితో పాటు పండ్లు ఫలాలు ఇస్తాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను అభివృద్ధి పేరిట నరికేస్తున్నారు. ఫలితంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి.

చెట్లు నరకడం వల్ల జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు విశాఖ వాసులు. రక్షా బంధన్‌ను వృక్షా బంధన్‌గా నిర్వహిస్తున్నారు. ఏటా రాఖీ పండుగకు ముందు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కడుతున్నారు. చెట్లకు కడుతున్న ఈ రాఖీలను విత్తనాలతో తయారుచేస్తారు. చెట్ల కాండానికి, కొమ్మలకు రాఖీలుగా కడతారు. ఈ ఏడాది కూడా గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో... 150 ఏళ్ల మర్రి చెట్టుకు విత్తనాలతో తయారు చేసిన రాఖీలను కట్టారు. పదుల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వృక్షో రక్షితి: రక్షితః అంటూ చెట్టును తమ సోదరునిలా భావించి మంగళ హారతులు ఇచ్చి రాఖీ కట్టారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అంటున్నారు విద్యార్థులు. తమకి ప్రాణవాయువును ఇస్తున్న చెట్లను తమ సోదరుడులా భావించి రాఖి కట్టమని తెలియజేస్తున్నారు. చెట్లను నరకడం ఆపి పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచాలని సూచిస్తున్నారు. చెట్లును నాశనం చేసుకుంటూ వెళ్తే వాతావరంలో మార్పులు సంభవించి ప్రకృతి ప్రకోపానికి గురవ్వకతప్పదని విద్యార్థులు అంటున్నారు.

విద్యార్ధులు రాఖీ కట్టిన మర్రిచెట్టుకు ఓ చరిత్ర ఉంది. ఈ మర్రి చెట్టుకు 150సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పట్లో ఈ చెట్టును కొట్టెయ్యాలని అధికారులు భావించగా..విశాఖలో ఉన్న ప్రకృతి ప్రేమికులు, గ్రీన్ క్లైమేట్ ప్రతినిధులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా రక్షా బంధన్‌ను పురస్కరించుకుని, గ్రీన్ క్లైమేట్ ప్రతినిధులు విద్యార్ధులతో రక్షా కట్టించి మర్రి చెట్టుపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు.

Tags:    

Similar News