Gulab Cyclone: గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు

Gulab Cyclone: ఉత్తరాంధ్ర జిల్లాలపై గులాబ్‌ తుఫాన్ పంజా * ఉత్తరాంధ్ర వెంబడి 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

Update: 2021-09-27 04:13 GMT

గులాబీ తుఫాను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Gulab Cyclone: గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ నిన్న రాత్రి తీరం దాటింది. తుపాను వల్ల రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారలు హెచ్చరించారు.

భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రానున్న ఆరు గంటల్లో తుఫాన్ బలహీన పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో కేవలం ఉత్తరాంధ్రలో మాత్రమే కాకుండా ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ, గజపతినగరం, నెల్లిమర్ల మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది.

చాలా చోట్ల విద్యుత్ స్థంభాలు, పెద్దపెద్ద చెట్లు నేలకూలాయి. పలు చోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చలా గ్రామాల్లో అంధకారం అలుముకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం అందించేందుకు NDRF, CRDF బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదారాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది.

Tags:    

Similar News