శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 27న ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ47ను ప్రయోగించనున్నట్టు షార్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో నాలుగు దశల రాకెట్ అనుసంధానం పూర్తయింది. ప్రయోగ వేదిక వద్దకు తరలించే క్రమంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని ఎలక్ట్రానిక్స్ సిస్టంలో శబ్దం రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించి నాయిస్ ను క్లియర్ చేశారు.
దీంతో శనివారం ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్‌ను ప్రయోగ వేదిక మీదకు తీసుకొచ్చి అమర్చారు. ప్రస్తుతం ప్రైమరీ వర్క్ దాదాపు పూర్తయింది. ఈరోజు(ఆదివారం) లాంచ్ ప్రీకౌంట్‌డౌన్ చేపట్టనున్నారు. 25వ తేదీ తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్), 26 ఉదయం 6.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను నిర్వహించడానికి షార్ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.