Prashant Kishor: వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయం

Prashant Kishor: ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే విజయమని జోస్యం

Update: 2024-03-04 02:12 GMT

Prashant Kishor: వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయం

Prashant Kishor: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీకే చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గతంలో ప్రశాంత్‌ కిశోర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పీకే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్‌ కిశోర్‌ మాట్లాడుతూ .. ప్యాలెస్‌లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కీలకమన్నారు. ఉచిత పథకాలు మాత్రమే అధికారాన్ని తీసుకురావన్న ప్రశాంత్‌ కిశోర్‌.. ఓటేసే ముందు జనం అభివృద్ధి కూడా పరిగణలోకి తీసుకుంటారన్నారు.

వైఎస్‌ జగన్‌ తప్పులే ఓటమికి దారితీస్తాయన్నారు. ప్రజల డబ్బునే ఖర్చు పెడుతూ.. ప్రజలను కాపాడుతున్నట్లుగా మాట్లాడడం ఏమాత్రం సరికాదన్నారు ప్రశాంత్ కిషోర్. తాను ఏపీలో గెలుపోటములపై ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్న ఆయన.. గతంలో అక్కడ పని చేసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి విషయంలో జగన్‌ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని అభిప్రాయపడ్డారు. కొందరు సలహాలు, సూచనలే జగన్‌ తీసుకుంటున్నారని.. అది రాబోయే ఎన్నికల్లో ముప్పుగా మారబోతుందంటూ పీకే హెచ్చరించారు. కొందరు వ్యక్తుల చేతుల్లోనే ప్రభుత్వం ఉందనే అపోహలున్నాయని.. ఈ తరుణంలో ఓటమి ఎదురవనుందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ప్రజలు ఈ సారి మార్పును కోరుకుంటున్నారని పీకే వెల్లడించారు.

పీకే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు విరుచుకుపడుతున్నారు.ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఫైర్‌ అయ్యారు. బిహార్‌లో చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా అంటూ విమర్శించారు. బిహార్‌లో పీకే పరిస్థితి ఎలా ఉందో.. చంద్రబాబు పరిస్థితి రాష్ట్రంలో అలా ఉందన్నారు. ఒక పీకే సరిపోలేదని, మరొక పీకేను చంద్రబాబు తెచ్చుకున్నారని ఆరోపించారు మంత్రి గుడివాడ.

 ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు ఏపీ మంత్రి అంబటి. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడని సెటైర్లు వేశారాయన. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. సంక్షేమం పేరుతో ప్రజల డబ్బునే ఖర్చు పెట్టి.. ప్రజలకు మంచి చేస్తున్నానని చెప్పడం తప్పన్న ఆయన.. జగన్‌ ఇచ్చే ఉచితాలకు ప్రజలు ఓటేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా.. ప్రశాంత్ కిషోర్ టార్గెట్‌గా సెటైర్లు వేశారు అంబటి.   

Tags:    

Similar News