ఎక్కువ మంది చదువుకోడానికే పీపీపీ మోడల్

టీడీపీ ఎప్పుడూ ప్రజలను మోసం చేయలేదని, మన రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలవాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు.

Update: 2025-12-15 10:30 GMT

మంగళగిరి : టీడీపీ ఎప్పుడూ ప్రజలను మోసం చేయలేదని, మన రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలవాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్- ప్రైవేట్ -పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంపై వస్తున్న రాజకీయ విమర్శలకు సమాధానం ఇచ్చారు. పీపీపీ విధానాన్ని సమర్థించేవాళ్లు ఉంటారు, విమర్శించేవాళ్లూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి, అదే మార్గంలో ముందుకు వెళ్లాలని స్పష్టంగా చెప్పడం సంతోషకరమని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎంబీబీఎస్ చదవాలనుకునే ప్రతి 10 లక్షల మందికి కేవలం 75 సీట్లు మాత్రమే ఉన్నాయని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ స్పష్టం చేసిందన్నారు. అందుకే ఇకపై పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటూ పార్లమెంటుకు చెందిన స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిందని, కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించిందని చెప్పారు.

భువనేశ్వర్ అధ్యక్షతన 31 మంది పార్లమెంట్ సభ్యులు ఈ నివేదికను రూపొందించారని, వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి రావాలంటే పీపీపీ మోడల్ తప్ప మరో మార్గం లేదని కమిటీ తేల్చి చెప్పిందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి, 4 కూడా పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. ఆ పరిస్థితిని సమీక్షించిన కూటమి ప్రభుత్వం, పీపీపీ విధానంలోనే వేగంగా, సమర్థవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యమవుతుందని గుర్తించి, ఈ విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, ఈ విధానంపై అవగాహన లేకుండా జగన్ రెడ్డి కోటి సంతకాల పేరుతో ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధార్ ఆధారాలు లేని సంతకాల్ని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కోటి కాదు, కనీసం 10–20 లక్షల నిజమైన సంతకాలు కూడా రాబట్టలేరని అన్నారు.

ఇప్పటివరకు ఒక్కో మెడికల్ కాలేజీకి 150 అండర్‌గ్రాడ్యుయేట్ సీట్లు ఉండేవని, కానీ పీపీపీ విధానంలో ఒక్కో కాలేజీకి 250 సీట్లు వరకు పెంచుకోవచ్చని కేంద్రం నివేదిక ఇచ్చిందన్నారు. దాంతో ఏపీలో పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజీల ద్వారా మొత్తం 2500 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పీపీపీ మోడల్ కావడంతో ఈ సీట్లకు కేంద్ర కోటా ఇవ్వాల్సిన అవసరం లేదని, జగన్ విధానం అయితే 15 శాతం కేంద్ర కోటాకు వెళ్లేదని తెలిపారు. గతంలో 1750 సీట్లు వస్తాయని చెప్పామని, ఇప్పుడు ఏకంగా 2500 సీట్లు రావడం ద్వారా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగ్గా ఉందని కేంద్రం కూడా నిర్ధారించిందన్నారు. ఈ విధానం ద్వారా రెండేళ్లలోనే కనీసం 2500 మంది కొత్త డాక్టర్లు రాష్ట్రానికి అందుబాటులోకి వస్తారని చెప్పారు. జగన్ విధానం అయితే ఇదే పనికి 15–20 ఏళ్లు పట్టేదని, కానీ పీపీపీ ద్వారా అదే కాలంలో 10 వేల మంది కొత్త డాక్టర్లు తయారవుతారని వివరించారు. వైద్య విద్య ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎక్కువమందికి చదువు అందాలంటే పీపీపీ మోడల్ అవసరమని కేంద్రం కూడా భావిస్తోందన్నారు. కన్వీనర్ కోటాలో పేద విద్యార్థులకు కేవలం రూ.15 వేల ఫీజుతో ప్రవేశం ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News