Polavaram Project Progress: ఊపందుకున్న పోలవరం స్పిల్ వే పనులు

Polavaram Project Progress: ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి.

Update: 2020-07-07 02:23 GMT

Polavaram Project Progress: ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. వీటిలో ప్రధానంగా స్పిల్ వే పనులను రెండు రోజుల నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతం వర్షాల కారణంగా వరద నీటితో కొంత ఇబ్బంది ఉన్నా వీలుకల్పించుకుని పనులను ముమ్మరం చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణంలో అతి కీలకమైన స్లాబ్‌ పనుల్లో భాగంగా 45, 46 బ్లాకులపై తొలి గడ్డర్‌ను అమర్చారు. పోలవరం పస్‌ఈ నాగిరెడ్డి, జలవనరుల శాఖ అధికారులు, మెగా కంపెనీ ఇంజనీర్లు పూజలు చేసి పనిని ప్రారంభించారు. స్పిల్‌వేలో ఇప్పటి వరకూ 52 బ్లాకులలో 52 పియర్స్‌ 52 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తయింది. స్లాబ్‌ పనుల ప్రారంభానికి ముందుగా పియర్స్‌ పై స్పిల్‌వే 2 కిలోమీటర్ల పొడవునా 196 గడ్డర్లను అమర్చవలసి ఉంటుంది.

ఇప్పటికే 110 గడ్డర్లను సిద్ధం చేశారు. నెలాఖరుకు వాటిని అమరుస్తామని, మిగిలిన 86 గడ్డర్లను నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని ఎస్‌ఈ తెలిపారు. మార్చి నాటికి స్పిల్‌వే పూర్తిస్థాయిలో గేట్ల అమరికతో సహా పూర్తవుతుందన్నారు. స్పిల్‌వే స్లాబ్‌ పటిష్టంగా ఉండేందుకు ఒక్కో గడ్డర్‌ నిర్మాణంలో 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 10 టన్నుల ఇనుము ఉపయోగించారు. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు, 22 మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల ఎత్తుంటుందని అధికారులు తెలిపారు.

వరద నీరు వృధాగా పోకుండా పట్టిసీమ నుంచి పంపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 19 మోటార్లు, 19 పంపులతో పోలవరం ప్రాజెక్టు కుడికాలువ ద్వారా 6,726 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేసినట్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈ ఖండవల్లి వరప్రసాద్‌ తెలిపారు. గోదావరి నీటిమట్టం 14.76 మీటర్ల వరకూ ఉండడం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం పెరుగుతుండడం వలన నీటి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. గత నెల 18వ తేదీ నుంచి ఈనెల 5వ తేదీ వరకు 7.66 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు విడుదల చేసినట్లు వివరించారు.


Tags:    

Similar News