Kurnool : ప్రధాని మోడీ పర్యటన.. ఈ నెల 16న కర్నూలుకు రానున్న ప్రధాని
ప్రధాని మోడీ పర్యటనతో కొత్త శోభను సంతరించుకున్న కర్నూల్..ఈ నెల 16 న కర్నూల్ కి రానున్న ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్.
Kurnool : ప్రధాని మోడీ పర్యటన.. ఈ నెల 16న కర్నూలుకు రానున్న ప్రధాని
ప్రధాని మోడీ పర్యటనతో కర్నూలు జిల్లా కొత్త శోభను సంతరించుకుంది. జిల్లా మరోసారి జాతీయ దృష్టిలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో అమాత్యుల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నలుగురు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు జిల్లా కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. దీంతో ప్రధాని పర్యటన జిల్లాకు ప్రతిష్ఠాత్మకంగా మారనుంది.
కర్నూలు జిల్లాలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పర్యటన షెడ్యూల్, వేదిక సన్నాహాలు, భద్రతా చర్యలు, ప్రజా రవాణా సౌకర్యాలపై విస్తృత స్తాయి చర్చ నిర్వహించారు సంబంధిత మంత్రులు. పర్యటనలో ఏ చిన్న లోపం చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉంది. నన్నూరు సభా ప్రాంగణం, శ్రీశైలం రోడ్ షోపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి శాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పనులు చేయాలని మంత్రి వర్గం సూచించింది.
ముఖంగా నన్నూరు సమీపంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ప్రధాన చర్చ వేదిక నిర్మాణం, వీక్షకుల సీటింగ్ ప్లాన్, పార్కింగ్ సదుపాయాలు, మీడియా జోన్ ఏర్పాట్లను మంత్రి వర్గం సమీక్షించింది. ప్రధానమంత్రి ప్రసంగానికి సుమారు లక్ష మందికి పైగా ప్రజలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశ ద్వారాలు, వీఐపీ గ్యాలరీ, మీడియా డెస్క్‌లు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. రోడ్ మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్‌పై ఎస్పీలు సమగ్ర వివరాలు ఇచ్చారు. వీఐపీ కదలికలు సాఫీగా సాగేందుకు తాత్కాలిక సైన్ బోర్డులు, కంట్రోల్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలానికి వెళ్లే మార్గంలో త్రిస్థాయి భద్రత అమలు చేయనున్నారు. దారిపొడవునా పోలీస్ పికెట్స్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ప్రారంభమయ్యాయి. సమావేశం జరిగే ప్రాంగణంలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఉండనుంది. భద్రతా విభాగాలు, ప్రోటోకాల్ టీంల మధ్య సమన్వయానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
శ్రీశైలం ఆలయ పరిధిలో ప్రధాని రోడ్ షో నిర్వహించే అవకాశముడంతో.. దీనికి సంబంధించిన ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం రోడ్ షో ప్రధాని రోడ్డు షో చేయనున్నారు. దీంతో ప్రధాని రూట్ మ్యాప్‌ను కేంద్ర భద్రతా దళాలు పరిశీలించాయి. భద్రతా విభాగాలు సీసీ కెమెరాలు, డిజిటల్ గేట్ స్కానర్లు, మొబైల్ సిగ్నల్ ఇంటర్‌సెప్షన్ సిస్టమ్స్ సిద్ధంగా ఉండనున్నాయి. శ్రీశైల ప్రాంతంలో వీఐపీ మువ్‌మెంట్ సమయంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయనున్నారు. సీఎం సెక్యూరిటీ బృందం కూడా ఫీల్డ్‌లోనే పర్యవేక్షణ చేస్తోంది. అధికారులు ఆలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. స్వామి దర్శనానికి ముందు ప్రధానమంత్రి పర్యటన రిహార్సల్ కూడా జరగనున్నాయి.
ఈ పర్యటనలో జీఎస్టీ, పారిశ్రామిక రంగాలపై ప్రధాని నేరుగా వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కర్నూలు నగరంలోని వాణిజ్య భవనాలను పరిశీలించి సరైన ప్రాంగణం ఎంపిక చేయాలని మంత్రి వర్గం సూచించింది. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమన్వయ బాధ్యతలు చేపట్టనున్నారు. వాణిజ్యవేత్తలు, ఎంఎస్ఎంఈ సంస్థలు, యువ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని ప్రసంగంలో పెట్టుబడులపై కీలక ప్రకటనలు వెలువడవచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు–నంద్యాల పరిశ్రమల విస్తరణపై కూడా చర్చ ఉండొచ్చు.. ప్రధాని సందర్శనతో జిల్లా వ్యాపార వాతావరణం మరింత చురుకుదనం సంతరించుకోనుంది. వాణిజ్య సమాఖ్యలు ఇప్పటికే ప్రాంగణం అలంకరణ పనులు ప్రారంభించాయి. ప్రధాని సందర్శన సందర్భంగా నగరంలోని ప్రధాన వీధులపై స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. వీధుల శుభ్రపరిచే పనులు, రోడ్ల రిపేర్ పనులు వేగంగా సాగుతున్నాయి.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం అయ్యాయి. ప్రధాని పర్యటన సందర్భంగా త్రిస్థాయి భద్రతా కవచం అమలు చేయనున్నారు అధికారులు. కేంద్ర భద్రతా దళాలు, స్థానిక పోలీస్ బలగాలు కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డానున్నాయి. రహదారుల పరిశీలన, చెక్‌పోస్టుల ఏర్పాటు, స్నిఫర్ డాగ్స్ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ సిద్ధం చేసి రహదారుల మీద సిగ్నల్ నియంత్రణ ప్రారంభించారు.
సర్క్యూట్ హౌస్ పరిసరాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణతో ప్రతి మూల చుట్టూ విజిలెన్స్ టీంలతో మానిటరింగ్ చేస్తున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ ఏరియాల్లో ఫైర్ సేఫ్టీ టీంలను పెట్టానున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసుల కోసం ప్రత్యేక అంబులెన్స్ యూనిట్లు సిద్ధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు 24 గంటల అలర్ట్‌లో ఉండనున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షేరాన్ కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యటనను కర్నూలు భవిష్యత్తు దిశగా ఒక పెద్ద అడుగుగా అభివర్ణిస్తున్నారు మంత్రులు. ప్రజల్లోనూ పర్యటనపై ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ప్రధాని స్వాగతానికి నగర వీధులు సర్వాంగ సుందరంగా అలంకరించబడుతున్నాయి.