Diamonds Searching: కర్నూలు జిల్లాలోని నంద్యాల - గిద్దలూరు మధ్య వజ్రాన్వేషణ

Diamonds Searching: నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాల కోసం జల్లెడ పడుతున్న జనం

Update: 2021-08-12 09:06 GMT

వజ్ర అన్వేషణ చేస్తున్న ప్రజలు (ఫైల్ ఇమేజ్)

Diamonds Searching: కర్నూలు జిల్లాలోని నంద్యాల - గిద్దలూరు మధ్య ఉన్న నల్లమల అటవీప్రాంతంలోని సర్వ నారసింహస్వామి క్షేత్ర పరిసరాల్లోని వంకల్లో వర్షానికి వజ్రాలు కొట్టుకొస్తాయన్న ప్రచారం ఉంది. ఈ ఏడాది తొలకరి చినుకులు ప్రారంభం కావడంతోనే వజ్రాల వేట ప్రారంభమైంది. వజ్రాల కోసం కర్నూలు అనంతపురం, కడప, ప్రకాశం, గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే కాకుండా, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ప్రజలు నల్లమల అటవీప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

ఇక స్థానికులు క్యారియర్లు కట్టుకుని భార్యాపిల్లలతో సహా ఆటో, కారు, మోటారు బైక్‌లపై వచ్చి పొద్దుపోయే వరకు వజ్రాల అన్వేషణలో నిమగ్నమవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు పొలాలకు సమీపంలోని చెట్ల కిందే వంట చేసుకుని తింటూ.. రాత్రిళ్లు పాఠశాలలు, ఆలయాల వద్ద తల దాచుకుంటారు.

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని, భూమి లోపల సహజ సిద్ధంగా జరిగే కొన్ని పరిణామాల వల్ల అవి భూపైభాగానికి చేరుకుంటాయని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ అధికారులు చెపుతున్నారు. మట్టితో మూసుకుపోయిన ఆ వజ్రాలు వర్షాలు, నీటి ప్రవాహం వల్ల బయట పడతాయని ఆయన వివరించారు.

బంగారం, వజ్రాల కోసం జరుగుతున్న అన్వేషణ ఈనాటిది కాదు. బ్రిటిష్‌ పాలనలో, అంతకు ముందు మహమ్మదీయులు, విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనూ ఆంధ్ర, రాయలసీమల్లో మైనింగ్‌ జరిగినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News