Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పటం వృద్ధురాలికి అండగా డిప్యూటీ సీఎం!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఇప్పటం గ్రామంలో పర్యటించినప్పుడు ఒక వృద్ధురాలికి ఇచ్చిన మాటను, నేడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో నిలబెట్టుకున్నారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చేరుకున్న ఆయన, బాధితురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అసలేం జరిగింది?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో పలువురి ఇళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న కక్షతోనే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో పవన్ కల్యాణ్ గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ సందర్భంలో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు.. "ఎన్నికల్లో గెలిచి పెద్ద పదవిలో ఉన్నప్పుడు మళ్లీ మా ఇంటికి రావాలి" అని పవన్‌ను కోరారు.
నేడు ఇప్పటం చేరుకున్న పవన్‌కు నాగేశ్వరమ్మ ఆత్మీయ స్వాగతం పలికారు. ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న పవన్, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నాగేశ్వరమ్మకు రూ. 50 వేలు, ఆమె మనవడి చదువు నిమిత్తం రూ. 1 లక్ష నగదును అందించారు. నాగేశ్వరమ్మ మనవడి విద్యాభ్యాసం కోసం ప్రతి నెలా తన వేతనం నుంచి రూ. 5 వేలు అందజేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
పెద్ద కుమారుడిలా వచ్చారు: నాగేశ్వరమ్మ
పవన్ పర్యటనపై నాగేశ్వరమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. "ఇచ్చిన మాట ప్రకారం పవన్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి పెద్ద కుమారుడిలా వచ్చి ఆప్యాయంగా పలకరించారు. నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మా కుటుంబానికి కొండంత అండగా ఉంటామని భరోసా ఇచ్చారు" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.