Posani Krishna Murali: రాజకీయాల్లో విమర్శలు సహజం

Posani Krishna Murali: జగన్‌పై విమర్శలు చేసే స్థాయి పవన్‌కు లేదు -పోసాని

Update: 2021-09-29 02:13 GMT

పోసాని కృష్ణ మురళి(ఫైల్ ఇమేజ్)

Posani Krishna Murali: రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఇప్పటికే పవన్‌ను చడామడా తిడుతున్నారు ఏపీ మంత్రులు. ఇక.. తాజాగా ఆ జాబితాలోకి పోసాని కృష్ణమురళి కూడా ఎంటర్‌ అయ్యారు. ఇప్పుడు ఇది కాస్త.. పోసాని వర్సెస్‌ పవన్‌ కల్యాణ్‌గా ముదిరింది. పవన్‌ను ఉద్దేశించి పోసాని చేసిన వ్యాఖ్యలు.. వివాదాన్ని మరింత పెంచాయి.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అలా అని కక్ష కట్టి మాట్లాడటం సరికాదని అన్నారు పోసాని. ఈ సందర్భంగా పోసాని, పవన్‌ మధ్య జరిగిన ఓ చిన్నపాటి వివాదాన్ని ప్రస్తావించారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌ రాత్రి షెడ్యూల్‌ చేయాల్సి వచ్చింది. అయితే.. అప్పటికే తన సమయం దాటిపోయిందని, అయినా పెద్ద హీరో కదా అని తాను వేచి ఉన్నట్టు పోసాని చెప్పారు. ఇక.. పవన్‌.. ఎప్పటికీ రాకపోవడంతో.. తాను ఇంటికి వెళ్లిపోయానని, రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఫోన్‌ చేసిన పవన్‌.. ఏవండీ మేము పిచ్చోళ్లమా? చెప్పకుండా ఎలా వెళ్తారు? సినిమా అంటే ఏమనుకున్నారు? అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. దాంతో తనకు కోపం వచ్చిందన్న పోసాని.. మీరు ఎప్పుడొస్తే.. అప్పటివరకు మేము వేచి ఉండాలా.. మేము కూడా ఆర్టిస్ట్‌లమే.. అంటూ గట్టిగా సమాధానం ఇచ్చారంట. ఆ తర్వాత ఆ సినిమా నుంచి తనను తప్పించినట్టు పోసాని చెప్పారు.

30ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నానని, తనకు ఎవరూ శత్రువులు లేరని అన్నారు పోసాని. తాను జగన్‌కు వీరాభిమానిని అన్న పోసాని.. ఆయనను ఏమైనా అంటే కోపం వస్తుందన్నారు. అసలు.. జగన్‌తో పోల్చుకునే స్థాయి పవన్‌కు లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కీలోమీటర్లు నడిచిన జగన్‌.. పేదల సమస్యలను విని, ఒక్కొక్కటిగా తీరుస్తున్నారన్నారు. గత టీడీపీ హయాంలో చేసిన అప్పులను జగన్‌ తీరుస్తూ వడ్డీలు కడుతూ కొత్త అప్పులు తెస్తూ.. ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటున్నారన్నారు. పవన్‌ ప్రతి పార్టీని విమర్శించే పని పెట్టుకున్నారన్నారు.

పవన్‌పై పోసాని విమర్శలను ఆయన జీర్ణించుకోలేకపోయిన అభిమానులు తనను తిడుతూ.. కొన్ని వేల ఫోన్‌ కాల్స్, మెస్సేజ్‌లు పెడుతున్నారని, అసభ్య పదజాలంతో ఇంట్లో వాళ్లందరినీ తిడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి . తనను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తనకు ఏమైనా జరిగితే పవన్‌ దే బాధ్యత అని చెప్పారు. ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడి వెళ్తున్న పోసానిని పవన్‌ ఫ్యాన్స్ అడ్డుకున్నారు. దాడి చేసేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోసానిని సెక్యూరిటీ మధ్య ఇంట్లో దించారు. ఇక.. పవన్‌పై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టేందుకు పోసాని సిద్ధమైనట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News