రైతులపై కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి: పవన్ కళ్యాణ్

తహశీల్దార్ వాహనాన్ని ఆపిన ఘటనలో భాగంగా కృష్ణాయపాలెం రైతులపై కేసులు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2020-02-20 10:11 GMT

తహశీల్దార్ వాహనాన్ని ఆపిన ఘటనలో భాగంగా కృష్ణాయపాలెం రైతులపై కేసులు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు.. ఎమ్మార్వో వాహనాన్ని అడ్డుకోవడం, పబ్లిక్ న్యూసెన్స్ సహా పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. వీరిపై చట్టరీత్య చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే దీనిపైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రైతులపై కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటనని విడుదల చేసింది.

"రాజధాని గ్రామం కృష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల ఎదుట నిరసన తెలిపిన రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వెల్లడిస్తోంది. రాజధాని అమరావతి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 426 మందిపై కేసులుపెట్టి రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఈ కేసులను ఉపసంహరించుకోవాలి. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను... ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించకనే ఆ రైతులు నిరసన తెలిపారు.

మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి తరుణంలో కేసులుపెట్టడం లాంటి చర్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతుంది. తొలి రోజు నుంచీ రైతులు శాంతియుతంగా తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం రైతాంగంతో చర్చించకుండా కేసులుపెట్టడం లాంటి చర్యలకు దిగడం అప్రజాస్వామికం అవుతుంది. రాజధాని కోసం పోరాడుతున్నవారికి జనసేన బాసటగా నిలుస్తుంది" అని పవన్ పేర్కొన్నారు.

ఇక ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడ అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా.. సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.  


Tags:    

Similar News