Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ రగడ

Andhra Pradesh: చలో విజయవాడ విజయవంతం కావడంతో ప్రభుత్వంలో ఆందోళన

Update: 2022-02-05 02:49 GMT

ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ రగడ

Andhra Pradesh: ఏపీలో ఉద్యోగుల ఉద్యమం పోలీసులకు తలనొప్పిగా మారింది. గురువారం జరిగిన చలో విజయవాడకు పోలీసుల సహకారం ఉందని బహిరంగంగానే ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు పోలీసుల నెక్స్ట్ ప్లానేంటి.. ఒకవేళ సమ్మె సైరన్ మోగితే పోలీసులు మళ్ళీ సహకరిస్తారా..?

ఉద్యోగ సంఘాల పిలుపుతో జరిగిన చలో విజయవాడకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉద్యోగులు తరలివచ్చారు. పోలీసులు ముందుగానే బారికేడ్లు, వందకు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఫాల్కన్ వాహనాలు సిద్ధం చేసారు. మరోవైపు వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసామర్థ్యం ఉండే ప్రదేశాలు, టిఫిన్ సెంటర్లు సైతం జల్లెడపట్టారు. బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం స్క్రీనింగ్ చేశారు.

అయితే ఒక్కసారిగా లక్షమంది అన్ని వైపుల నుంచీ బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకోవడం చూసి, బ్యారికేడ్లు కూడా ఆపలేవని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఉన్న ఫోర్స్ 2500 మంది.. మహా అయితే ఎంతమందిని అదుపుచేస్తారు. కానీ వచ్చిన వాళ్ళు మూడున్నర కిలోమీటర్ల మేర నిండిపోయారు. బీఆర్టీఎస్ రోడ్డు ఒక ఉద్యోగుల సముద్రంలా తయారయింది. దాంతో పోలీసులు చేతులెత్తేసారని టాక్. కానీ పోలీసులే అందరిని బీఆర్టీఎస్ రోడ్డుకు వచ్చేందుకు సహకరించారట. ఆ మాటలు ఏకంగా ఉద్యోగ సంఘాల నాయకులే బహిరంగంగా మైకుల్లో చెప్పారు. చివరకు మైకు కూడా పోలీసులే ఇచ్చారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి జరిగే నిరసనలకు పోలీసుల సపోర్టు ఉంటుందా‌ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోలీసులూ ఉద్యోగులే.. సరాసరి సమ్మెకు దిగలేకపోవచ్చు కానీ.. సమ్మెకు అజ్ఞాతం నుంచి సపోర్టు చేయచ్చని కొందరు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం బందోబస్తు చేయకతప్పదు. మరోవైపు పోలీసుల సహకారం తమకు ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News