East Godavari: తూర్పుగోదావరిలో కొనసాగుతున్న కోవిడ్ కల్లోలం

East Godavari: ఇప్పటివరకూ 2.60లక్షల మందికి పాజిటివ్ * కోవిడ్ నుంచి కోలుకున్న 2.50లక్షల మంది

Update: 2021-06-27 13:45 GMT

Representational Image

East Godavari: దేశవ్యాప్తంగా సెకండ్‌వేవ్ కంట్రోల్‌లోకి వచ్చినా.. ఆ ఒక్క జిల్లాలో మాత్రం కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రోజువారీ కేసులు వెయ్యిలోపే అయినా.. అక్కడ మాత్రం పాజిటివ్ గ్రాఫ్‌లో ఏమాత్రం తేడా లేదు. ఇంత జరుగుతున్నా ఇటు.. జనాల్లోనూ, అటు.. పాలకుల్లోనూ మార్పనేదే లేకుండా పోతోంది. తూర్పుగోదావరి కోవిడ్ పరిస్థితులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..

రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా తూర్పుగోదావరిలో కోవిడ్ కల్లోలం కొనసాగుతుంది. కరోనా రెండు దశల్లోనూ ఇక్కడ రెండు లక్షల 60వేలకు పైగా పాజిటివ్స్ నమోదయ్యాయి. ఇప్పటివరకూ రెండు లక్షల 50వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 11వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రేంజ్‌లో కోవిడ్ విజృంభిస్తున్నా జిల్లా ప్రజల్లో మార్పనేదే లేదు.. కర్ఫ్యూ ఆంక్షలను సైతం పట్టించుకోకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు.

మరోవైపు.. కోవిడ్ ఆంక్షలు ఉన్నా పెళ్లిళ్లు, ఫంక్షన్లు యధావిధిగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫంక్షన్ల నిర్వహణలో అధికారులు కఠినంగా లేకపోవడంతోనే ఇదంతా జరుగుతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. వీటికితోడు పాయంత్రం వేళ వాకింగ్, వ్యాయామాల పేరుతో రోడ్లపైకి వస్తున్నా పట్టించుకునే అధికారే కనిపించడం లేదు.

ఇక.. కోవిడ్ సమయంలో కొందరు పొలిటికల్ లీడర్స్ తీరు అధికారులకు తలనొప్పిగా మారింది. ఇటీవల ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తోట త్రిమూర్తులకు అభిమానులు స్వాగతం పలికిన తీరును పలువురు ఉదాహరణగా చెబుతున్నారు. రావుల పాలెం మొదలుకొని తోట నివాసం వరకూ వేల మంది అభిమానులతో నిర్వహించిన భారీ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులే ఆంక్షలు ఉల్లంఘించడం పలువురు మండిపడుతున్నారు.

జిల్లాలో కోవిడ్ కంట్రోల్ కాకపోవడానికి ప్రజలు, అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమవుతుంది. కోవిడ్ థర్డ్‌వేవ్ కామెంట్స్ భయపెడుతున్న వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం వైరస్‌ను లైట్ తీసుకున్నా మరో విధ్వంసం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News