అధికార భాషా సంఘం చైర్మన్ విక్రమ్ ప్రమాణస్వీకారం

అధికార భాషా సంఘం చైర్మన్ గా నియమితులైన పి.త్రివిక్రమరావు (విక్రమ్ పూల) గురువారం స్థానిక పున్నమి ఘాట్ లోని హరిత బెర్మ్ పార్క్ సమావేశ మందిరంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Update: 2025-12-12 06:36 GMT

విజయవాడ: ప్రపంచం నలుమూలలా తెలుగు భాష ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసేలా అధికార భాషా సంఘం సారధిగా, వారధిగా పనిచేస్తుందని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం నూతన చైర్మన్ పి.త్రివిక్రమరావు తెలిపారు. అధికార భాషా సంఘం చైర్మన్ గా నియమితులైన పి.త్రివిక్రమరావు (విక్రమ్ పూల) గురువారం స్థానిక పున్నమి ఘాట్ లోని హరిత బెర్మ్ పార్క్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్వీకారోత్సవ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిధిగా హాజరై, ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ త్రివిక్రమరావు మాట్లాడుతూ, చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, ఆత్మీయులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్ గా తనను నియమించడం మర్చిపోలేనన్నారు. తన నియామకానికి తోడ్పడిన వారిలో మంత్రి నారా లోకేష్, కూటమి నాయకులు ఉన్నారన్నారు. తెలుగు భాషా సంఘానికి చైర్మన్ గా రావడం అనేది కత్తిమీద సాము లాంటిదని, ఎందుకంటే ఇతర భాషల ప్రభావం తెలుగుపై ఎక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు భాషని కాపాడుకుంటూ, తెలుగు భాషను సంరక్షించడంతోపాటు ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో తెలుగు భాష ఉపయోగాన్ని పెంచడంవంటి కార్యక్రమాలపై అందరి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లతానన్నారు.

తనకు తొలి నుంచి తెలుగు భాష, సంస్కృతి పట్ల, తెలుగు పత్రికా రంగంపై అనురక్తితో, అభిమానంతో పత్రికా రంగానికి వచ్చానన్నారు. అనుకోని పరిస్థితుల్లో పత్రికా రంగం నుంచి రాజకీయ రంగం వైపు రావడం, తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పరిచయం క్రమంగా అనుబంధంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఇటీవల మహా స్వాప్నికుడు చంద్రబాబు అనే పుస్తకం రాయడం జరిగిందని, అది తన మనస్సు అంతరాళం నుంచి వచ్చిందన్నారు. నేను చూసిన వాళ్లలో అంత ఓపిక, అంత సహనం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ముఖ్యమంత్రితో ఆయనకున్న జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు భాషాభివృద్ధికి రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మొదటిది ప్రముఖ తెలుగు పండితుడు, ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి తెలుగు భాషకు ప్రత్యేకమైన స్థానం తీసుకువచ్చిన మండలి వెంకట కృష్ణారావు పేరుతో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయడం తెలుగు భాష పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. రెండవది అధికార భాషా సంఘాన్ని ప్రజల మధ్యలోకి తీసుకువెళ్లి, భాషా ఔన్నత్యాన్ని పెంపొందించగల వ్యక్తిగా, విలువలతో కూడిన సుదీర్ఘ పాత్రికేయ సేవలు అందించిన తివిక్రమరావు ను అధ్యక్షుడిగా నియమించడం ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనమన్నారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో తివిక్రమరావు తనదైన ముద్ర వేసుకుంటూ విశ్లేషకుడిగా అంకిత భావంతో సేవలందించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే "మహా స్వాప్నికుడు" గ్రంథం, అలాగే "1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం – సజీవ చరిత్ర" వంటి రచనలు ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.

ప్రభుత్వం ఇటీవల నియమిస్తున్న పలు అకాడమీ, సంస్థల చైర్మన్ పదవులు కూడా సంబంధిత రంగాల్లో సేవలు అందించిన ప్రతిభావంతులకే దక్కడం, కళా–సాంస్కృతిక అభివృద్ధిపై ప్రభుత్వ దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. అదే తరహాలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించడం తెలుగు భాషా మహిమాన్వితాన్ని దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా వ్యాప్తి చేసే దిశగా కీలకంగా నిలుస్తుందన్నారు. తెలుగు మాతృభాషాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న త్రి భాషా విధానం, ప్రాథమిక విద్యలో తెలుగుకు ప్రధాన స్థానం కల్పించడం వంటి చర్యలు కూడా విక్రమ్ నాయకత్వంలో అధికార భాషా సంఘం పనితీరుకు మరింత బలం చేకూరుస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య, 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ, శాసనమండలి మాజీ సభ్యులు టీడీ జనార్ధన్, సీనియర్ నాయకులు నన్నపనేని రాజకుమారి, వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News