నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఒంగోలు రిమ్స్

Ongole Rims Hospital: పేరుకే పెద్దాసుపత్రి..లోపలికి వెళ్తే సౌకర్యాలు నిల్

Update: 2022-08-23 06:32 GMT

నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఒంగోలు రిమ్స్ 

Ongole Rims Hospital: అదో పేరుమోసిన సర్కారు ఆసుపత్రి. పేరుకు మాత్రమే పెద్దాసుపత్రి...క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే మాత్రం సమస్యల పుట్ట రాజ్యమేలుతోంది. రోగాన్ని నయం చేసుకునేందుకు ఆసుపత్రికి వస్తే..ఒక్క మందు బిళ్లకూడా దొరకని పరిస్థితి. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్తున్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. రోగుల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా రిమ్స్‌ యంత్రాంగం తీరులో మార్పు రావడంలేదు. ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వైద్యుల కొరత రిమ్స్‌ను తీవ్రంగా వేధిస్తోంది. కీలకమైన సర్జన్లు లేకపోవడంతో రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఆపరేషన్లకు కీలకమైన మత్తు డాక్టర్లు లేకపోవడంతో పేరుకే పెద్దాసుపత్రిగా రిమ్స్‌ మారింది. ఇక గుండెజబ్బులు, న్యూరాలజీకి పోస్టులే లేకపోవడం తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటీవల బదిలీలు జరగడంతో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి కొంతమంది వైద్యులు వచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంతా ఉచితమే అన్న ప్రకటన కేవలం గోడలకే పరిమితం అవుతోంది. ఖరీదైన వైద్యపరీక్షలకు ప్రైవేటు సెంటర్లకు పరుగులు పెట్టాల్సిందే. అంతేకాదు..రోగులకు ఇచ్చే మందుబిళ్లలు సైతం అరకొరగానే ఇస్తుండడంతో బాధితులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. ఆసుపత్రికి వచ్చే బాధితులు, వారి వ్యాధులను బట్టి 250 రకాల మందుల అవసరం ఉండగా..ప్రస్తుతం 50 రకాలే ఇస్తున్నారు. అవి కూడా అరకొరగానే ఉంటున్నాయి. దీంతో మందుల కోసం బయట మెడికల్ షాపులకు పరుగులు తీయాల్సిందే. ఉచిత ఓపీ తప్ప అన్నింటికి చేతిలో డబ్బులు పట్టుకోవాల్సిందే.

2007లో 300కోట్ల వ్యయంతో 37 ఎకరాల్లో నిర్మించిన GGHకు ఒకప్పుడు నిత్యం 2వేల మంది రోగులు వస్తుండేవారు. కానీ ఇప్పుడు కనీసం 300 మంది రోగులు రావడంలేదు. వివిధ విభాగాల్లో లోపాలే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కీలకమైన చికిత్స విభాగాల్లో వసతులు లేవు. అయితే తప్పని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో రిమ్స్‌లో చేరిన పేదలను పట్టించుకునే వారే లేరు. ఇప్పటికైనా రిమ్స్‌ అధికారుల నిర్లక్ష్యపు రోగానికి మందు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రోగులు కోరుతున్నారు.

Tags:    

Similar News