Andhra Pradesh: అమ్మను రక్షించండి.. నాన్నను అరెస్ట్ చేయండి ప్లీజ్.. ఎస్సైకు తొమ్మిదేళ్ల బాలుడు కంప్లైంట్..

Bapatla: పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే కరడుగట్టిన నేరస్థులకైనా వెన్నులో వణుకుపుడుతుంది.

Update: 2023-05-05 08:13 GMT

Andhra Pradesh: అమ్మను రక్షించండి.. నాన్నను అరెస్ట్ చేయండి ప్లీజ్.. ఎస్సైకు తొమ్మిదేళ్ల బాలుడు కంప్లైంట్..

Bapatla: పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే కరడుగట్టిన నేరస్థులకైనా వెన్నులో వణుకుపుడుతుంది. సామాన్య ప్రజలైతే అటు చూడాలంటేనే ఎందుకొచ్చిన గొడవరా బాబు అని ఒకింత భయపడతారు. కానీ, ఓ తొమ్మిదేళ్ల బాలుడు..ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు..ఎస్సైని కలిశాడు..ధైర్యంగా తన బాధ చెప్పుకోవడమే కాదు...కంప్లైంట్ చేశాడు..ఆ చిన్నారి తెగువను చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.

ఆ బాలుడికి తన తల్లి మీద ఉన్న ప్రేమే అంతటి ధైర్యాన్ని ఇచ్చింది. ఇక, విషయం ఏంటంటే, బాపట్ల జిల్లా కర్లపాలెం గ్రామానికి చెందిన సుభానీ, సుభాంబీ భార్యాభర్తలు..వీరికి తొమ్మిదేళ్ల బాలుడు రహీమ్ ఒక్కగానొక్క సంతానం..సుభాని స్థానికంగా ఉన్న రైసు మిల్లులో పని చేయడంతో పాటు ఇంటివద్ద కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుభాంబీ ఇంటిపట్టునే ఉంటూ భర్త, కొడుకు బాగోగులు చూసుకుంటోంది. అయితే కొన్నేళ్ల పాటు సక్రమంగా కాపురం చేసిన సుభానీ మద్యానికి బానిస అయ్యాడు. రోజు రాత్రిళ్లు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టి హింసిస్తున్నాడు. తండ్రి సుభానీ రోజు తన తల్లిని కొట్టడం చూసి చిన్నారి రహీమ్ గుండె గాయపడింది.

తండ్రి రోజు తాగివచ్చి తల్లిని కొట్టడం...తల్లి కన్నీరుమున్నీరు కావడం రహీమ్ తట్టుకోలేకపోయాడు. తల్లికి తన తండ్రి పెడుతున్న బాధ నుంచి ఉపశమనం కలిగించాలని డిసైడ్ చేసుకున్నాడు. అంతే ఆ తొమ్మిదేళ్ల బాలుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. బాలుడుని చూసిన ఎస్ఐ ఎందుకొచ్చావని అడిగితే..తన తండ్రిపై ఫిర్యాదు చేయడానికి వచ్చానంటూ ఎలాంటి బెరుకు లేకుండా సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, అమ్మీని కొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా అబ్బా వినడం లేదని తన తండ్రికి మీరే బుద్ధి చెప్పాలంటూ ఎస్ఐని ఆ చిన్నారి వేడుకున్నాడు.

రహీమ్ నుంచి వివరాలు సేకరించిన ఎస్ఐ వెంటనే బాలుడి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటివి జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానంటూ రహీమ్ తండ్రి సుభానికి ఎస్ఐ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా, తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. చిన్నారి తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News