ఎన్‌కౌంటర్: అల్లూరి జిల్లాలో భారీ ఎదురుకాల్పులు – ముగ్గురు మావోయిస్టు టాప్ నేతలు హతం
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు మృతి. అరుణ, ఉదయ్, అంజు హతం. మూడు ఏకే-47 రైఫిల్స్ స్వాధీనం.
ఎన్‌కౌంటర్: అల్లూరి జిల్లాలో భారీ ఎదురుకాల్పులు – ముగ్గురు మావోయిస్టు టాప్ నేతలు హతం
అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవీపట్నం మండలం కొండమొదల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో ముగ్గురు కీలక మావోయిస్టు నాయకులు హతమయ్యారు.
హతమైన వారు ఎవరు..?
భద్రతా అధికారులు ప్రాథమికంగా మృతి చెందిన మావోయిస్టులను ఇలా గుర్తించారు:
- అరుణ – మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు, ఇటీవల మృతి చెందిన అగ్రనేత చలపతిరావు భార్య.
- గాజర్ల రవి అలియాస్ ఉదయ్ – మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
- అంజు – ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీకి చెందిన కీలక నేత.
వీరు గతంలో 2018లో డుంబ్రిగుడ సమీపంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్టు సమాచారం. అరుణపై రూ.20 లక్షల రివార్డు ఉంది.
భద్రతా బలగాల విజయవంతమైన ఆపరేషన్
పొడవైన గస్తీ ఆపరేషన్ అనంతరం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మూడు ఏకే 47 రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి మారేడుమిల్లి సీఐ, దేవీపట్నం ఎస్సై బలగాలతో చేరుకున్నారు.
సరైన ఇంటెలిజెన్స్‌తో ముందస్తు దాడి
భద్రతా దళాలు విశ్వసనీయ ఇంటెలిజెన్స్ ఆధారంగా ముందస్తుగా సాగించిన ఆపరేషన్‌లో ఈ విజయం సాధించినట్టు సమాచారం. చాలా కాలంగా పోలీసులకు పట్టుబడకుండా దాగివున్న ఈ మావోయిస్టు నేతలు విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్నారు.
ఈ ఘటనతో ఏవోబీ జోన్‌లో మావోయిస్టు చట్రం తీవ్రంగా కుదేలైనట్టు భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
వారి హత్యల కేసులు, గ్రౌండ్ వర్క్, భద్రతా సవాళ్లు వంటి అంశాలపై మరిన్ని వివరాలు వెలుగు చూడనున్నాయి.