ఏపీలో చికెన్ షాపులకు కొత్త రూల్స్..! లైసెన్స్ తప్పనిసరి – ప్రతి దుకాణం రికార్డ్‌లోకి!
ఏపీలో చికెన్ షాపులపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రతి చికెన్ షాప్‌కి లైసెన్స్ తప్పనిసరి. ఎక్కడి నుంచి చికెన్ వస్తుందో, ఎవరికి అమ్ముతున్నారో అన్నీ ట్రాక్ చేయనుంది ప్రభుత్వం. వివరాలు తెలుసుకోండి.
ఏపీలో చికెన్ షాపులకు కొత్త నిబంధనలు!
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులపై కొత్త రూల్స్ తీసుకురానుంది. మాంసాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చికెన్ దుకాణాలకు లైసెన్సింగ్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై ప్రతి చికెన్ షాప్‌కి లైసెన్స్ తప్పనిసరి, అలాగే అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ రికార్డు చేయాల్సి ఉంటుంది.
ప్రతి లావాదేవీ రికార్డ్‌లోకి
ఏ ఫారం నుంచి చికెన్ తెచ్చారో, ఎవరికీ అమ్మారో అనే వివరాలు అన్ని ట్రాక్ చేసే సిస్టమ్‌ను ప్రభుత్వం తీసుకురానుంది. చికెన్ బిజినెస్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
కీలక నిర్ణయాలు సమావేశంలో
ఈ నిర్ణయాలు ఇటీవల పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీసుకున్నారు. సమావేశానికి సంస్థ ఛైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు, డైరెక్టర్లు ప్రవీణ, అజ్ముద్దీన్, శాఖ సంచాలకుడు దామోదర్ నాయుడు తదితరులు హాజరయ్యారు.
అక్రమ దుకాణాలపై దాడులు
మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అక్రమ చికెన్, మటన్ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గుర్తింపు పొందిన షాపుల నుంచే హోటళ్లు మాంసం కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది.
ఇంజెక్షన్ కోళ్ల విక్రయాలపై కఠిన చర్యలు
ఇంజెక్షన్ వాడిన కోళ్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యం. ప్రజల ఆరోగ్య భద్రత కోసం, మాంసం నాణ్యత కోసం ఈ చర్యలు చేపడుతున్నారు.
వ్యర్థాల నిర్వహణలో కొత్త ప్రణాళిక
చికెన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సురక్షితంగా డిస్పోజ్ చేసే విధానం రూపొందిస్తున్నారు. చికెన్ వ్యర్థాలను చేపల ఆహారంగా వాడుతున్న వారిపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.
పీ-4 మోడల్ షాపులు & పర్యవేక్షణ
పీ-4 విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో మోడల్ చికెన్ షాప్ ఏర్పాటు చేయనుంది. పశువుల సంతలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండనుంది. ప్రజలకు నాణ్యమైన మాంసం అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.