Weather updates: రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Update: 2020-06-12 08:02 GMT

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒక వైపు రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎండలతో అవస్థలు పడిన జనాలకు ఈ వర్షాలతో కాస్తంత ఊరట లభించింది. తొలకరి జల్లులు కురువడంతో రైతన్నలు వ్యవసాయ పనులను ప్రారంభించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాంతో రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయి. ఈ రుతుపవనాలకు అల్పపీడనం తోడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 

అటు ఏపీలోనూ నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో రుతుపవనాలు విస్తరించాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచానా వేస్తున్నారు.

తొలకరి చినుకులు కురవడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. తొలకరి పులకరింపుతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. విత్తనాలు వేస్తూ వానకాలం పంటల సాగును ప్రారంభించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని తెలియడంతో రైతన్నలు జోరుగా పనులు ప్రారంభిస్తున్నారు. 

Tags:    

Similar News