ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీ : మంత్రి దుర్గేష్
ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.
విజయవాడ : ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో మంగళవారం జరిగిన "అమరావతి బాలోత్సవం"లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాసరచన, వక్తృత్వ, నృత్య, నాట్య, డ్రాయింగ్ పోటీలను స్వయంగా పరిశీలించారు. కాంతార, భరతమాత, రాణి రుద్రమదేవి, రైతు వేషంలోని చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. ఈ సందర్భంగా వేలాది మంది విద్యార్థులతో అమరావతి బాలోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను మంత్రి దుర్గేష్ ప్రశంసించారు. బాలోత్సవ కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించేందుకు వారధిగా పని చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ‘‘మంచి గాలి కోసం, మంచి జీవితం కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం”అనే నినాదంతో ఈ ఏడాది అమరావతి బాలోత్సవం నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఈరోజు నుండి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ అమరావతి బాలోత్సవం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. అమరావతి బాలోత్సవం అద్భుత కార్యక్రమమని, ఇందులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. పిల్లల ఆకాంక్షలకు ఆంక్షలు విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి, విద్యా ప్రగతికి, విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు, నైతికత పెంపొందించేందుకు బాలోత్సవాలు దోహదపడుతాయని తెలిపారు. నిత్యం తరగతి గదిలో సిలబస్, పరీక్షలు, మార్కులు ఇలా ఒత్తిడితో ఉండే విద్యార్థులకు చదువుతో పాటు ఇతర అంశాల్లో వారి ప్రతిభను పరీక్షించేందుకు ఇలాంటి వేడుకలు నిర్వహించడం మంచి నిర్ణయం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ విద్యార్థులను ఒకచోట చేర్చి, వారి మధ్య ఆట పాటలు నిర్వహించడం, బృంద చర్చలు నిర్వహించడం వల్ల వారిలో స్నేహభావం, ఐకమత్యం, సమానత్వ విలువలు మెరుగుపడుతాయన్నారు. ప్రతి విద్యార్థికి చదువులతో పాటు కళలు, క్రీడలు, ఇతర అంశాల్లో ప్రావీణ్యం ఉంటుందని, తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకుండా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల్లో పట్టుదల, తపన ఉంటే వంద శాతం విజయం సాధించవచ్చని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. విద్యార్థుల నడవడికను, వ్యవహార శైలిని, ఆలోచనా ధోరణిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని చెప్పారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అద్భుత ఆలోచనల నుండి పుట్టిన మాక్ అసెంబ్లీ ఎలా జరిగిందో అందరూ చూశారని, విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియలు, శాసనసభ పనితీరుపై ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించడం, రాజ్యాంగ విలువలు, ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహన పెంచడం, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. చాగంటి కోటేశ్వరావు లాంటి మహానుభావుడితో నైతిక విలువలపై పాఠ్యాంశాలు నేర్పిస్తుండటం గర్వించే అంశమన్నారు.