మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి : సోము వీర్రాజు

Update: 2019-11-29 02:21 GMT

ప్రజా జీవితంలో ఉన్నవారు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని, మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీలలోని రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు అవమానకరమైన రీతిలో ఆరోపణలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైంది కాదని ఆయన అన్నారు. ప్రజలు వాటిని గమనిస్తున్నారని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇక సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇసుక ధరను తగ్గించాలని వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

పాస్టర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించడాన్ని ఆయన వ్యతిరేకించారు. చర్చి ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం నుండి పాస్టర్లకు జీతాలు చెల్లించవచ్చని ఆయన సూచించారు. దేవాలయాలను స్వతంత్రంగా మార్చాలని ఆయన అన్నారు. విశాఖపట్నంను పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించాలని దాంతో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని ఆయన అన్నారు. ఆయన వెంట బీజేపీ నేతలు ఆర్డీ విల్సన్, పి జగన్మోహన రావు కూడా ఉన్నారు.

Tags:    

Similar News