ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర

Andhra Pradesh: *సిక్కోలు నుంచి అనంతపురం వరకు యాత్ర *ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్న మంత్రులు

Update: 2022-05-26 01:09 GMT

ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర 

Andhra Pradesh: ఏపీలో బడుగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు బస్సు యాత్ర చేపడుతోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ కేబినెట్‌లో 17మంది బడుగు బలహీన వర్గాల నేతలకు ప్రాతినిథ్యం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారు. సంక్షేమ పథకాలు బడుగులకు ఉపయోగకరంగా ఉండేలా చూశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడానికి సిక్కోలు నుంచి నుంచి అనంతపురం వరకు వైసీపీ మంత్రుల సామాజిక న్యాయ భేరీ రథం సాగనుంది.

శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ నుంచి ఇవాళ ఉదయం 9.30 గంటలకు మంత్రుల బస్సు యాత్ర బయలుదేరనుంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను చుట్టేసి గోదావరి తీరం మీదుగా కోస్తాలోకి యాత్ర అడుగు పెడుతుంది. అక్కడి నుంచి రాయలసీమ జిల్లాల్లో సాగిస్తారు. అనంతపురం వేదికగా సామాజిక న్యాయ గర్జనను వినిపించనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మంత్రుల బస్సు యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో తొలి బహిరంగ సభ, రాజమండ్రిలో రెండో బహిరంగ సభ, నర్సరావుపేటలో మూడో బహిరంగ సభ, అనంతపురంలో నాలుగో బహిరంగ సభ నిర్వహించి యాత్రను ముగిస్తారు.

ఈ బస్సు యాత్రలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత, అందుతున్న పథకాలను ప్రజలకు వివరించనున్నారు మంత్రులు. మంత్రులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే జిల్లాల్లో బస్సు యాత్ర విజయవంతం అయ్యేలా నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జగన్ లేకుండా సాగుతున్న తొలియాత్ర ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక న్యాయభేరీతో, ఏపీ అంతటా సమరభేరీ మోగించడానికి మంత్రులు సిద్ధమవడం హాట్ టాపిక్‌గా మారింది. 

Tags:    

Similar News