అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకున్న నేపథ్యంలో పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు అమరావతిలో పర్యటించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు,గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం, రైతుల ప్లాట్ లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులు పరిశీలించారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ లలో మౌళిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రెండేళ్లలో డ్రైనేజ్ లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులో కి తెస్తామన్నారు.
అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసమీకరణ చేపడతామని చెప్పారు. లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు తీసుకున్న వారి సమస్యను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ లు ఉన్న 11, 8 జోన్లలో మినహా అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. 66 వేల ఫ్లాట్స్ లో 7 వేల ఫ్లాట్స్ మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్ లు చేయాల్సి ఉందని తెలిపారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ రోజుకు 30 నుంచి 60 మంది చేసుకుంటున్నారని చెప్పారు. 450 మంది రైతులకు ఇవ్వాల్సిన 1891 ఫ్లాట్స్ కు సంబంధించి కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ లు రోజుకు వెయ్యి చేసేలా అధికారులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రైతులు ముందుకొచ్చి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. మంతి నారాయణ తో పాటు ఈ పర్యటనలో అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు ఉన్నారు.