Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు

Andhra Pradesh:*13 జిల్లాల కలెక్టర్లతో ఈనెల 28 వరకు సమావేశాలు *ఏప్రిల్ 2 నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు

Update: 2022-02-24 03:00 GMT

ఏపీలో కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు

Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. గత నెలలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలకు ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి. అన్ని జిల్లాల్లో కలిపి 2వేలకు పైగా అర్జీలు అందాయి. 1,478 అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చాయి. ప్రజాప్రతినిధులు, వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాలు వినతులు ఇస్తున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు అందాయి. ఇక అభ్యంతరాల స్వీకరణకు వచ్చే నెల 3 దాకా గడువు ఉంది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహాలు సాగుతున్నాయి.

13 జిల్లాల కలెక్టర్లతో ఈ నెల 28 వరకూ నాలుగు రోజుల పాటు విజయవాడ, తిరుపతి, విశాఖ, అనంతపురం నగరాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. విజ్ఞప్తుల గురించి ఈ సమావేశాల్లో జిల్లాల కలెక్టర్లు వివరించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ ఆదేశాలు జారీచేశారు. బుధవారం విజయవాడలో కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సమావేశం పూర్తయింది‌. ఇక ఇవాళ తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో, 26న అనంతపురంలో అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో, 28న విశాఖలో విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయి.

ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్ ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. జిల్లాల విభజనపై 30 రోజులపాటు అభ్యంతరాలకు గడువు ఇచ్చినట్లు విజయ్ కుమార్తెలిపారు. మార్చి 3 వరకూ అభ్యంతరాలు కలెక్టర్లకు ఇవ్వొచ్చని చెప్పారు. ఇప్పటివరకూ వచ్చిన అభ్యంతరాలపై సమీక్ష చేస్తున్నామని, మార్చి 10 లోపు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు వెల్లడించారు. ఇక ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. ఏదేమైనా.. ఉగాది నాటికి ఏపీలో కొత్త జిల్లాలతో పరిపాలన ప్రారంభించే దిశగా అడుగులేస్తున్నారు.

Tags:    

Similar News