విశాఖ మన్యంలో మళ్ళీ చెలరేగుతున్న 'మలేరియా'

సీజనల్ గా ఎక్కువగా ప్రతాపం చూపించే మలేరియా.. విశాఖ మన్యంలో ప్రస్తుతం కలవరపెడుతోంది.

Update: 2020-05-19 02:24 GMT
a mad died with malaria in vishakhapatnam agency taking for funerals by dolly

విశాఖ మన్యంలో మరోసారి మరణ మృదంగం మోగుతోంది... మలేరియా బారిన పడి మరణాలు సంభవిస్తున్నాయి. రెండు, మూడేళ్లతో పోలిస్తే ఇవి దాదాపుగా రెట్టింపయ్యాయి. అయితే అపిడమిక్‌ సమయంలో అన్ని చర్యలూ తీసుకున్నా, మరణాలకు అడ్డుకట్ట వేయలేని విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధికార యంత్రాంగం ఐదేళ్లకోసారి వ్యాధి విజృంభణ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. అయినా దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

ప్రతి ఏటా ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు అపిడమిక్‌ సీజన్‌గా అధికార యంత్రాంగం చెబుతుంది. ఈ సమయంలో ఏజెన్సీ వ్యాప్తంగా మలేరియా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా 2075 ఏజెన్సీ గ్రామాల్లో 1.40 క్ష దోమ తెరల పంపిణీతో పాటు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు ఇంటింట దోమ నివారణ మందును పిచికారీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లుతో కలిసి సిబ్బంది ఎక్కువగా ఉండటంతో ఈ ప్రక్రియ మే చివరికల్లా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ చర్యలన్నీ సకాలంలో నిర్వహిస్తే మలేరియా తీవ్రత తగ్గుముఖం పట్టాలి. అయితే దానికి భిన్నంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు చూస్తే 447 మంది మలేరియాతో మరణించారు. కొయ్యూరు మండలం యు.చీడికపాలెం పంచాయతీ పాలసముద్రంకు చెందిన కొర్రా భీమరాజు అనే వ్యక్తి మరణించగా, తాజాగా ఆదివారం ఆయన కుమారుడు కొర్రా శ్రీను చనిపోయాడు. ఈ విధంగా ఏజెన్సీలో బీమవరం, మినుములూరు, యు.చీడగికపాలెం, లుబ్బూరు, జి.మాడుగులల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ విధంగా గత రెండేళ్లతో పోలిస్తే మలేరియా మరణాలు రెట్టింపయ్యాయని గుర్తించారు. ఈ విధంగా రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో గిరిజనులకు డోలీ మోత తప్పటం లేదు. దీంతో వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. అపిడమిక్‌ సీజనులో అన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి తీవ్రంగా ఉంది. వాస్తవంగా నాలుగైదు ఏళ్లకు ఒకసారి మలేరియా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, 2016లో ఇదే సమయానికి 900కు పైగా మరణాలు సంభవించాయని, అదే మాదిరిగా ఈ ఏడాది మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని అధికాయి అంచనా వేస్తున్నారు.

ఈ విధంగా మరణాలు అధిక సంఖ్యలో ఉంటాయని గుర్తించిన అధికారులు వాటిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోకుండా కేవలం గతంలో మాదిరిగానే దోమ తెరల పంపిణీ, దోమల నివారణ మందు పిచికారీ వంటి కార్యక్రమాలకే పరిమితమవుతుండటం విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లా మలేరియా నియంత్రణ అధికారి మణి మాట్లాడుతూ వ్యాధి తీవ్రత ఉన్న గ్రామాలను గుర్తించి, రక్త పరీక్షలు నిర్వహించి, ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. 

 


Tags:    

Similar News