Low Pressure: రేపు అండమాన్ తీరంలో అల్పపీడనం
Low Pressure: రాయలసీమ, దక్షిణ కోస్తాలకు పొంచి ఉన్న మరో ముప్పు
అండమాన్ తీరంలో ఆల్ఫా పీడనం (ఫైల్ ఇమేజ్)
Low Pressure: ఏపీకి మరో ముప్పు మంచుకొస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలే మళ్లీ టార్గెట్ కాబోతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తర్వాత 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొమరిన్, శ్రీలంక తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం నుంచి రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు డిసెంబరు 1 వరకూ చేపల వేటకు వెళ్లొదని సూచించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.. డిసెంబరు 1 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.