Liquor Sales: ఏపీ లో భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు

Liquor Sales: మరణాల సంఖ్య లెక్కకు మించిపోవడం వంటి పరిణామాలు మద్యం అమ్మకాలపై పడినట్లు సమాచారం.

Update: 2021-05-26 08:15 GMT
మద్యం అమ్మకాలు (ఫైల్ ఇమేజ్)

Liquor Sales: అసలే కరోనా.. ఆ పై కర్ఫ్యూ... ఇక మద్యపానం అమ్మకాలు ఎలా సాగుతాయ్? కరోనా ఉన్నా సరే.. కర్ఫ్యూ ఉన్నా సరే.. నిత్యావసరాలకు ఇచ్చినట్లే మద్యపానం అమ్మకాలకు మినహాయింపులిచ్చింది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే అక్కడి గల్లాపెట్టెలోంచి సొమ్ములు వచ్చి పడేది ఖజానాలోకే కదా. అసలే కరువు కాలం. ఖర్చులెక్కువ.. ఆదాయం తక్కువ.. అందుకే దాని మీద బాగా డిపెండ్ అయిపోయింది ఏపీ సర్కార్. కాని కరోనా కేసులు బాగా పెరిగిపోవటం.. అందులోనూ మరణాల సంఖ్య లెక్కకు మించిపోవడం వంటి పరిణామాలు జనాన్ని భయంలో పడేశాయి. అందుకే బయట తిరగడం తగ్గించేశారు.. మద్యపానం ఎవరన్నా తెచ్చిపెడితే తప్ప.. దాని కోసం వెళ్లటం మానేశారట.. దీంతో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి.

సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా మద్యం మీద వచ్చే ఆదాయమే సింహభాగంగా ఉంటుంది. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆ నిధులనే ప్రభుత్వాలు వినియోగిస్తుంటాయి. అందుకే లాక్ డౌన్ సమయంలోనూ మద్యం షాపులు తెరిచి ఉంచుతున్నారు. అన్ని కాలాల్లో కంటే సమ్మర్ సీజన్లో మద్యం అమ్మకాలు ఎక్కువ సాగుతుంటాయి. ముఖ్యంగా మందుబాబు బీర్లు కేసులకు కేసులు కొనుగోలు చేస్తుంటారు. మండు వేసవిలో చల్లటి బీరును తాగుతూ పరవశించిపోతుంటారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా మారిపోయింది. నడి వేసవిలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. షాపుల సంఖ్య తగ్గడమో, కర్ఫ్యూ ప్రభావమో తెలియదు గాని అమ్మకాలు మాత్రం రికార్డు స్థాయిలో పడిపోయాయి.

కర్ఫ్యూ కారణంగా మద్యం దుకాణాల సమయాలను తగ్గించడంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు రాష్ట్రంలో బీరు, లిక్కర్‌ కలిపి మొత్తం 21,31,558 కేసుల విక్రయాలు జరగ్గా... మే నెలలో అదే తేదీల మధ్య 16,74,343 కేసులే అమ్ముడయ్యాయి. దీంతో మద్యం అమ్మకాలు 21.45 శాతం మేర తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో బీర్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయి. కానీ ఈసారి ఆ జోరు కనిపించడం లేదు.

ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 28,184 బీరు కేసులు విక్రయించగా.. మే నెలలో కర్ఫ్యూ అమలైన 5వ తేదీ నుంచి 23 వరకు రోజుకు సగటున కేవలం 13,423 బీరు కేసులే అమ్ముడుపోయాట. దీంతో బీరు అమ్మకాల్లో 52.37 శాతం తగ్గుదల నమోదైందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. బీర్లతో పాటు బ్రాందీ, విస్కీ వంటి లిక్కర్‌ అమ్మకాలు కూడా బాగా తగ్గాయి. ఏప్రిల్‌ నెలలో రోజుకు సగటున 63,455 కేసుల లిక్కర్ విక్రయించగా.. మే నెలలో 5 నుంచి 23 తేదీ వరకు రోజుకు సగటున 56,665 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో లిక్కర్‌ అమ్మకాలు 10.70 శాతం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 1-23 మధ్య మద్యం ఆదాయం రూ.1,531.97 కోట్లు రాగా... మే 23 వరకు రూ.1,318.17 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతోనే మద్యం అమ్మకాలు భారీగా తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News