వరద నీటితో ఇబ్బందిపడుతున్న కృష్ణలంక ప్రజలు

Update: 2020-10-02 04:59 GMT

ఒకటి కాదు.. రెండు కాదు అది 30 ఏళ్ల సమస్య. నిత్యం అక్కడి ప్రజలు వరద నీటితో సావాసం చేస్తారు. దీంతో విసుగు చెందిన ఆప్రాంత ప్రజలు సమస్యకు పరిష్కారం చూపండి మహాప్రభో అంటూ నేతలకు చేతులెత్తి దండం పెడుతున్నారు. అసలు ఏంటి ఆ సమస్య..? వారు పడుతున్న బాధేంటి..? ఎక్కడుంది ఆప్రాంతం..?

ప్రకాశం బ్యారేజీకి దిగువ ఉన్న ప్రాంతం కృష్ణలంక. అయితే బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేసిన ప్రతీసారి ఈ ప్రాంతం ముంపునకు గురవుతోంది. అదేవిధంగా వర్షం వచ్చిన డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఇక్కడ జీవనం సాగిస్తున్న సుమారు 5వేల కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వరదలు వచ్చినా ప్రతీసారి కృష్ణలంక ముంపునకు గురికావడంతో అధికారులు వీరిని వేరే ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలకోసం కొందరు నేతలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అటు ప్రజలు కూడా బెజవాడలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. దీంతో వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆలోచననే విరమించుకున్నారు రాజకీయ నాయకులు.

ఇక నానాటికి పెరిగిపోతున్న ప్రజల ఇబ్బందులను గుర్తించిన అధికారులు శాశ్వాత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. దీంతో మొదటి ఫేజ్‌ కింద కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు ఈవాల్‌ని నిర్మించారు‌. అయితే రిటైనింగ్‌ వాల్‌కు రంధ్రాలు ఏర్పడటంతో వరద మళ్లీ కృష్ణలంకలోకి వచ్చింది. అయితే ఇప్పుడు సమస్యను పరిష్కరించాల్సిన నేతలు ముంపు ప్రాంతం అనీ తెలిసినా జీవనం ఎందుకు సాగిస్తున్నారనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. దీంతో ప్రజలు కూడా వారికి తమదైన రీతిలో సమాధానం చెబుతున్నారు. ఏదీ ఏమైనా వరద సమయంలో అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మేమున్నామంటూ ధైర్యం చెప్పాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలి. అప్పుడే వారిని ప్రజలు నేతలుగా గుర్తిస్తారు.

Tags:    

Similar News