జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని, చేతకాని దద్దమ్మ అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రైల్వేకోడూరులో రైతు సంక్షేమం.. జనసేన ధ్యేయం పేరుతో ఎందుకొచ్చాడో ఏమి మాట్లాడుతున్నాడో అర్ధం కావడంలేదని అన్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కాబట్టి తన బలం చూపిద్దామని ఇక్కడికి వచ్చినట్టే ఉంది తప్ప రైతుల కోసం కాదని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుకు దత్తపుత్రుడిగా ఉన్నాడని, ఆరోజు వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి పారిపోయాడని ప్రశ్నించారు.
అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుందని విమర్శించారు. ప్యాకేజీ ఎవరు ఇస్తే వారి మాట మాట్లాడే గుణం ఉన్న పవన్ రైతులకు ఏమి ఒరగబెడతారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఏ పార్టీకో లాభం చేసేలా ఉందని అన్నారు. కాగా రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అటు రైతులు, ఇటు పార్టీ నేతలను కలుసుకుంటున్నారు. ఇవాళ ఆయన రెండు పార్లమెంటు నియోజవర్గాలపై సమీక్ష జరపనున్నారు.