Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత

Srisailam: కన్నడ భక్తుడిపై షాపు యజమాని దాడితో తీవ్ర ఉద్రిక్తతలు

Update: 2022-03-31 03:45 GMT

Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ వీధుల్లో కన్నడ భక్తులు రెచ్చిపోయారు. టీ షాపు దగ్గర మొదలైన చిన్న వివాదం ఘర్షణకు కారణమైంది. స్థానికంగా ఉన్న ఒక సత్రం దగ్గర టీ షాపు దగ్గర నీళ్ల విషయంలో గొడవ మొదలైంది. ఈ గొడవలో స్థానికులకు, కర్ణాటక వాసులతో మాట మాట పెరిగి దాడి చేసుకునే వరకు వివాదం వెళ్లింది. స్థానికుడు కర్ణాటక వాసిని గొడ్డలితో దాడి చేశాడు.

ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రం కావడంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలియడంతో కర్ణాటక వాసులు దాడికి దిగారు. శ్రీశైలంలోని, రోడ్లకు ఇరువైపుల ఉన్న తాత్కాలిక దుకాణాలను ధ్వంసం చేశారు. పాతాళ గంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్‌లల్లోని, తాత్కాలిక షాపులను పూర్తిగా ధ్వంసం చేశారు. దుకాణాలపై దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పరిస్థితిని గమనించిన ఈవో లవన్న, జగద్గురువు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 చెన్న సిద్ధరామ పండితారాధ్య, శివాచార్య, కర్ణాటక స్వామిజీలతో మాట్లాడారు. ప్రత్యేక పోలీస్ బృందాలతో పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

Tags:    

Similar News