చినుకు పడితే కాకినాడ చిత్తడి..చిత్తడే!

Update: 2020-09-19 07:56 GMT

నీరు పల్లమెరుక నిజం దేవుడెరుక అన్న చందంగా తయారైంది కాకినాడ స్మార్ట్ సిటీ పరిస్థితి. చిన్న చినుకు పడితే చాలు స్మార్ట్ నగరం చెరువును తలపిస్తోంది. ఇక భారీగా కుండపోత వర్షం కురిసిందంటే సాగరానికి ఏమాత్రం తీసిపోని విధంగా నగరంలో రోడ్లు వర్షపు నీటితో నిండిపోతున్నాయి. నిజం తెలిసినా పాలకులు, అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతుందనుకున్న కాకినాడ నగరం ముంపు నగరంగా మారుతోంది.

ప్రస్తుతం పెరిగిన జనాభాతో అవసరాలకు అనుగుణంగా కాకినాడ నగరాన్ని తీర్చిదిద్దడంలో పాలకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2015లో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసిన తొలి జాబితాలోనే స్ధానం సంపాదించినా అభివృద్ధిలో మాత్రం వెనుక ఉండిపోయింది. చినుకు పడితే చాలు కాకినాడ నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి. స్మార్ట్ సిటీ భాగంలో పనులకు కేటాయించిన నిధులను నగరాభివృద్ధికి వినియోగించడంలో పాలకులు అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో స్మార్ట్ నగరం ముంపు బారిన పడుతోందని అంటున్నారు ప్రజలు.

50 డివిజన్లు ఉన్న కాకినాడ నగరంలో చినుకు పడితే సగానికి పైగా డివిజన్లు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రోజుల తరబడి రోడ్లపై నీరు నిలవ ఉండిపోతోంది. కాకినాడ నగరంలోని సాంబమూర్తినగర్, రేచర్లపేట, సినిమా రోడ్, మెయిన్ రోడ్, దేవాలయం వీధి, ఇందిరానగర్ వంటి ప్రాంతాలను ముఖ్యంగా ఈ సమస్య వెంటాడుతోంది. వేసిన రోడ్లనే వేయడం తప్ప గత ఆరేళ్లుగా కాకినాడ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిందేమీ లేదంటున్నారు బీజేపీ నాయకులు. మరోవైపు నగరంలో డ్రయినేజీల నిర్మాణంలో లోపాలు కూడా ముంపునకు కారణమని అంటున్నారు.

భౌగోళికంగా కాకినాడ నగరం సముద్ర మట్టానికి రెండడుగుల నుంచి 1 మీటరు కిందకు ఉంటుంది. దీంతోనే వర్షపు నీరు సముద్రంలో కలిసేందుకు ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్యపై దృష్టి సారించకపోవడమే ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు సాక్ష్యంగా నిలుస్తోంది. మరోవైపు డ్రైనేజీల్లో చెత్త వేయడం వల్లే ముంపు సమస్య తలెత్తుతోందని కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తరలించేందుకు మోటార్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి కాకినాడ స్మార్ట్ సిటీపై ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాలని ముంపు సమస్యను నుంచి తమను కాపాడాలని కోరుకుంటున్నారు స్థానికులు.

Tags:    

Similar News